GST Refund Scam in Income Tax Department : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జూలై నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన రీఫండ్ అక్రమాలపై "ఈ ఏడాది మార్చి 18న 'ఈటీవీ తెలంగాణ'' పరిశోధనాత్మక కథనం వచ్చింది. ఈ-బైక్‌ల తయారీ, టాల్కమ్ పౌడర్ ఉత్పత్తి సంస్థల పేరుతో డీలర్ల అవతారమెత్తిన కొందరు అక్రమార్కులు సర్కారు సొమ్మును దోచేశారు. వాణిజ్య పన్నులశాఖలోని కొందరు అధికారులు అవినీతిపరులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా రీఫండ్‌లు ఇచ్చేశారు.
హైదరాబాద్ రూరల్ డివిజన్, ప్రస్తుత మాదాపూర్ డివిజన్ పరిధిలో ఈ బాగోతం జరిగింది. డిప్యూటీ కమిషనర్ నుంచి డీసీటీవో వరకు కమిషన్లు పంచుకున్నట్లు సమాచారం. మూడు నుంచి నాలుగు బోగస్ కంపెనీలకు సుమారు రూ. 60 కోట్లు రిఫండ్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు అధికారులైతే తాను బదిలీ అయిన చోటుకు సైతం ఆ బోగస్ సంస్థలను బదిలీ చేసుకుని మరీ రీఫండ్‌లు ఇచ్చినట్లు తేలింది.
GST Assessments In Telangana : ఈ-బైక్‌ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. దీనిని ఆసరా చేసుకున్న అక్రమార్కులు మాదాపూర్ కేంద్రంగా బోగస్ సంస్థలకు తెరలేపారు. ఈ-బైక్‌ల తయారీ నిమిత్తం జీఎస్టీ లైసెన్స్‌లు తీసుకున్నారు. ఈ లైసెన్స్‌లు ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే లైసెన్స్‌లు ఇచ్చేశారు. ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలు చేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
బయట నుంచి ఈ-బైక్ విడిభాగాలు తీసుకొచ్చినట్లు వాటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించినట్లు ఇన్‌వాయిస్‌లు సృష్టించారు. ఆ విడిభాగాలను అసెంబుల్ చేసి 5 శాతం జీఎస్టీతో ఈబైక్‌లు అమ్మినట్లు బిల్లులు అప్‌లోడ్ చేశారు. విడిభాగాల విలువపై చెల్లించిన 18 శాతం జీఎస్టీలో కేంద్ర నిబంధన ప్రకారం 13 శాతం రాయితీ పొందారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్మును దోచేసిన అక్రమార్కులు అధికారులకు అడిగినంత కమిషన్ ఇచ్చారు. కోటి రూపాయిలు రీఫండ్ ఇస్తే రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అధికారులు కమిషన్లు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.
Fake GST Registrations In Hyderabad : మాదాపూర్ సర్కిల్ పరిధిలో ఓ అధికారిణిని 2022 నవంబరు నుంచి 2023 ఆగస్టు వరకు రూ. 14 కోట్లుకు పైగా రీఫండ్ ఇచ్చేశారు. మాదాపూర్ సర్కిల్‌లో మరో అధికారి 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు దాదాపు రూ. 26 కోట్లు రీఫండ్ చేశారు. ఇంకో అధికారి 2022 నవంబరు నుంచి గత ఏడాది ఆగస్టు వరకు రూ. 19 కోట్లు రీఫండ్‌లు ఇచ్చారు. ఈ ముగ్గురు అధికారులు కలిసి దాదాపు రూ. 60 కోట్లు మేర అనర్హులకు ప్రభుత్వ సొమ్ము దోచి పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టికే శ్రీదేవి నేతృత్వంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ డివిజన్ జాయింట్ కమిషనర్ గీత నేతృత్వంలో ప్రాథమిక పరిశీలన తర్వాత అక్రమాలు నిజమేనని తెలిసి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ట్యాక్స్ కన్సల్టెంట్ చిరాగ్ శర్మ, కడపకు చెందిన రాజా రమేశ్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.
తాజాగా వాణిజ్య పన్నుల శాఖకు చెందిన నల్గొండ డివిజన్ డిప్యూటీ కమిషనర్ పీతల స్వర్ణకుమార్, మాదాపూర్-1 సర్కిల్‌కు చెందిన ఏసీ విశ్వకిరణ్, అబిడ్స్ సర్కిల్‌కు చెందిన ఏసీ వేణుగోపాల్, మాదాపూర్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మహిత, మరో డీసీటీవో వెంకటరమణలను అరెస్టు చేశారు. వీరిని నాంపల్లి 12వ మెట్రోపాలిటిన్ మేజిస్టేట్ ముందు హాజరుపర్చగా ఈనెల 17వ తేదీ వరకు జుడిషియల్ రిమాండ్ విధించారు. సీసీఎస్ డీసీపీ శ్వేత, ఏసీపీ హరీష్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం.
అమలులో లోపాలే జీఎస్టీకి శాపాలు
జీఎస్టీ ఎగవేత కేసు - కావ్య మైనింగ్ ఎండీ, బిగ్ లీప్ టెక్నాలజీస్ డైరెక్టర్ అరెస్ట్