Fight for Mutton in Marriage in Nizamabad : తెలంగాణలో ముక్కలేనిదే ముద్ద దిగదు. ఏ పండుగా వచ్చినా, దావత్ వచ్చినా మటన్ ఉండాల్సిందే. లేకపోతే అది పరువుకు సంబంధించిన ముచ్చట. మటన్ పెట్టకుండా వేరే వంటకంతో సరిపెడదామనుకున్నా 'అయ్యో మటన్ పెట్టలేదా' అని ముఖం పట్టుకుని అడిగేస్తారు. తర్వాత ఇంకా అవే గుసగుసలు. 'దావత్ చేసిండ్రు కానీ మటన్ పెట్టలేదు' అని రెండు మూడు నెలలైనా మర్చిపోరు. పెళ్లిలో ఇలాంటి సంఘటన జరిగితే తరాలు మారినా ఆ ఇంట్లో ప్రతి ఫంక్షన్లో ఇదే ముచ్చట గురించి మాట్లాడుకుంటారు. మీ పెళ్లిలో ఎలాగో మూలుగ బొక్క పెట్టలేదు ఇప్పుడైనా ఉందా లేదా అంటారు. ఇక్కడ నాన్‌వెజ్‌కు అంత ప్రాధాన్యత ఇస్తారు మరి.
దావత్లల్ల ముక్కల కోసం అయ్యే పంచాయితీ వెరే లెవల్ అనుకోండి. దానిపైన సినిమా(బలగం మూవీ)లే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు దీనికుండే ప్రాముఖ్యత. వినడానికి చిన్న విషయంలాగే అనిపించినా ఇది తెలంగాణలో ఇజ్జత్‌కు సంబంధించిన ముచ్చట. ముఖ్యంగా ఇలాంటి పంచాయితీలు పెళ్లిల్లో చూస్తుంటాం. పిల్లగాడి తరఫున వాళ్లం మాకు తక్కువ ముక్కలు వడ్డిస్తారా? ఇదేనా మర్యాదా? అంటూ గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ముక్కల పంచాయితీ రక్తపాతలను సృష్టించిన దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా నిజామాబాద్ నవీపేటలో జరిగింది. పెళ్లి భోజనంలో మటన్ సరిగ్గా వడ్డించలేదని వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.
కట్నం అడిగినందుకు వరుడిని చితకబాదిన వధువు ఫ్యామిలీ.. మటన్ సరిపోలేదని పెళ్లి క్యాన్సిల్!
ఎస్సై వినయ్, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం నవీపేటకు చెందిన యువతిలో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో పెళ్లి జరిపించారు. అనంతరం విందులో వరుడి తరఫున వారు కొందరు యువకులకు మటన్ వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ ఈ యువకులు వడ్డించేవారితో గొడవకు దిగారు. వధువు తరఫు బంధువులు కల్పించుకోవడంతో ఇరుపక్షాల మధ్య గొడవ నెలకొంది.
ఇది కాస్త ముదిరి వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకునేవరకు దారి తీసింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్న వారు ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మందికి, మరో వర్గానికి చెందిన సాయిబాబాతో కలిపి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గాయపడిసిన సత్యనారాయణ, సాయిబాబా సహా ఎనిమిది మందిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
మటన్‌షాప్‌ల వద్ద పోలీసుల బందోబస్తు.. అసలు విషయం తెలిస్తే షాక్.!