TG Indiramma Housing Scheme : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం ప్రజాపాలన సభల ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలనకు నడుం బిగించింది. ఈ మేరకు త్వరలోనే ప్రక్రియను ప్రారంభించాలని బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి జోనల్ కమిషనర్లను ఆదేశించారు. దరఖాస్తుల ఆధారంగా ఇంటింటి సర్వే చేపట్టి దరఖాస్తుదారుల అర్హతలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ మొబైల్ యాప్‌లో వివరాలను నమోదు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్లో సర్వే పూర్తి చేసేందుకు సుమారు 900 మంది సర్వేయర్లు అవరసమని, అందుకు తగ్గట్లుగా అవసరమైన సిబ్బందిని సమాకూర్చాలని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్ బోర్డు సీఈఓను కోరుతూ జీహెచ్‌ఎంసీ లేఖ పంపింది.
నెల రోజుల్లోనే పూర్తి చేయాలంటూ : తొలి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం జీహెచ్‌ఎంసీలోని 24 నియోజకవర్గాలకు 84 వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రజాపాలన సభల్లో మొత్తం 10 లక్షల 70 వేల 446 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు డివిజన్ల వారీగా ఆయా దరఖాస్తులను విభజించి సర్వే చేయాలని బల్దియా నిర్ణయించినట్లు చెప్పారు. నెలరోజుల్లోనే అన్ని దరఖాస్తులను పరిశీలించాలంటే దాదాపు 900 మంది అవసరమని, జీహెచ్‌ఎంసీకి చెందిన 409 మంది సిబ్బందికి సర్వే విధులను కేటాయిస్తున్నామని కమిషనర్ లేఖలో పేర్కొన్నారు.
గ్రేటర్‌లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పూర్తి చేసేందుకు మరో 488 మంది సిబ్బందిని సమాకూర్చాలని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు, కంటోన్మెంట్ బోర్డు సీఈఓను బల్దియా కమిషనర్ కోరారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ వినియోగంపై త్వరలోనే సర్వేయర్లకు శిక్షణ ఇస్తామని వివరించారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ఎస్సీలు, ఎస్టీలు, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది.
నేటి నుంచి మీ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల సర్వేయర్లు - 'యాప్' ఓకే అంటే మీకు ఇల్లు వచ్చేసినట్లే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ఆవిష్కరణ - రేపటి నుంచి లబ్ధిదారుల నమోదు