Ganja Supplier Arrested in Nanakramguda : తెలంగాణాకే తలమానికంగా నిలుస్తూ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన నానక్రాంగూడాలో గంజాయి గుప్పుమంటోంది. ఇక్కడ మత్తుమందు విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. పోలీసులు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్లోనే ఈ దందా గురించి బయటపడింది. ఇదంతా ఏళ్ల తరబడి నీతూబాయి అనే ఓ మహిళ సాగిస్తుంది. గతంలో ఆమెపై పీడీ చట్టం ప్రయోగించి, సంవత్సరం పాటు జైళ్లో ఉంచినా విడుదలైన తర్వాత మళ్లీ దందా కొనసాగిస్తుండటం దర్యాప్తు అధికారుల్ని ఆశ్చర్యపోయేలా చేసింది.
మత్తు పదార్థాల కట్టడికి ఏర్పాటైన తెలంగాణ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారంపై తెలంగాణలోని అన్ని పోలీసు యూనిట్లను తరచూ అప్రమత్తం చేస్తున్నారు. ఆ క్రమంలో సిద్దిపేట కమిషనరేట్ పోలీసులకు మరింత సమాచారం దొరికింది. ఇటీవలే ములుగు ప్రాంతంలో చిక్కిన ఇద్దరు గంజాయి విక్రేతలను విచారించినప్పుడు తాము నానక్‌రాంగూడలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి
Woman Arrested in Ganja Case in Nanakramguda : అక్కడ బహిరంగంగానే విక్రయిస్తున్నారని తెలపడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ధ్రువీకరణ కోసం సిద్దిపేట కమిషనర్ అనురాధ ఇటీవల ఒక టీంను నానక్‌రాంగూడకు పంపించారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు గంజాయి కొనేందుకు పదిహేను మంది వరకు క్యూలో నిల్చొని ఉండటం కనిపించింది. వారు కూడా అదే క్యూలో నిల్చోని రూ.5వేలకు గంజాయి కావాలని అడిగారు. నీతుబాయి ఏ మాత్రం వెనకాడకుండా సరకు ఇచ్చింది. పోలీసులు అది తీసుకుని వెనుదిరిగారు. కమిషనర్ అనురాధ జరిగినదంతా సందీప్శాండిల్యకు చేరవేశారు.
నీతూబాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు సందీప్‌శాండిల్య ప్లాన్ వేశారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్మహంతి సహకారంతో బృందాన్ని ఏర్పాటు చేసి నీతూబాయి గృహానికి పంపించారు. అయితే ఆమె ఇంటి లోపలికి వెళ్లేందుకు నాలుగు అంచెల గ్రిల్స్ ఉన్నాయని, ఒకవేళ పోలీసులు వాటిని తొలగించుకుని లోపలికి వెళ్తే గంజాయిని మ్యాన్‌హోల్‌లో వేసే అవకాశముందని సిద్దిపేట పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వడంతో అందుకు అనుగుణంగా అపరేషన్ చేపట్టాలని ప్రణాళిక వేశారు.
సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా - హైదరాబాద్‌లో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్
స్వీపర్లతో ఆపరేషన్లోకి : ఈ క్రమంలో పోలీసుల వెంట ఇద్దరు స్వీపర్లను తీసుకెళ్లారు. గ్రిల్స్ తొలగించేలోపు మ్యాన్‌హోల్‌ను బ్లాక్ చేసి గంజాయి కొట్టుకుపోకుండా స్వాధీనం చేసుకోవాలనే విధంగా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే పోలీస్ టీం అక్కడికి వెళ్లింది. అయితే స్వీపర్ల అవసరం లేకుండానే ఆపరేషన్ పూర్తి చేశారు. పోలీస్ బృందం వెళ్లే సరికి అక్కడ 10మంది గంజాయి కొనుగోలు చేస్తూ కనిపించారు. నీతూబాయితో పాటు కొనుగోలు చేస్తున్నవారందరిని అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో భారీగా గంజాయితో పాటు రూ.16లక్షలు జప్తు చేశారు.
నీతూబాయిపై మొదట 2017లో శేరిలింగంపల్లి ఎక్సైజ్ విభాగం కేసు నమోదు చేసింది. అప్పటినుంచి 2021 సెప్టెంబరు వరకు ఆమెపై 12 కేసులు నమోదు కావడంతో పీడీ చట్టం ప్రయోగించారు. సంవత్సరం తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చి రెండు నెలలకే మరోసారి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది. అలా గత అక్టోబర 25 వరకు మరో 6కేసులు నీతూబాయిపైన నమోదయ్యాయి. తాజా పరిణామాల వల్ల ఆమెపై మరోసారి పీడీ చట్టం ప్రయోగించేందుకు హైదరాబాద్ పోలీసులు నివేదిక రూపొందించారు.
కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్ల అమ్మకం - ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్