Gac Fruit Farming In Telugu States : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ రైతన్నలు సరికొత్త పంథాలో పండ్ల తోటలు సాగుచేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అందరికంటే భిన్నంగా ఆలోచించాడు ఏలూరుకు చెందిన యువరైతు. 'ఫ్రూట్ ఫ్రం హెవెన్' అని పిలిచే ఆ పండును తెలుగు రాష్ట్రల్లో పండిస్తూ తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందుకుంటున్నాడు ఈ రైతు. మరి, ఆ అరుదైన పండ్ల జాతి ఏమిటి? దాన్ని ఎలా పండిస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
గ్యాక్ ఫ్రూట్ పంటలు : రంగులో నారింజలా, ఆకారంలో చిన్నపాటి పనసలా కనిపిస్తున్న ఈ పండు పేరు గ్యాక్ ఫ్రూట్. ఈ పండు అధిక పోషకాలను అందిస్తుంది. ఔషధ తయారీలో అధికంగా ఈ ఫ్రూట్‌ని ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఈ పండు రైతుకు ఆదాయం అందిస్తుంది. అది గ్రహించిన ఈ యువరైతు విదేశాలకే పరిమితమైన గ్రేట్ అమెరికన్ కంట్రీ పంటను తెలుగు రాష్ట్రాల్లో పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
ఏపీలోని ఏలూరు జిల్లా మామిడిగొంది గ్రామంలో వెంకటేశ్ నివసిస్తున్నాడు. అదే గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రకరకాల మొక్కలు పెంచడమంటే ఇతనికి చాలా ఇష్టం. అదే ఇష్టంతో గ్యాక్ ఫ్రూట్ గురించి తెలుసుకున్నాడు. వెంటనే మొక్కలు తెచ్చి ఇక్కడ పంట సాగుచేస్తున్నాడు.
మనం ఏ వృత్తిలో ఉన్నా అభిరుచిని మరవొద్దు అంటున్నాడు వెంకటేశ్. అందుకోసం ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో 50 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఆదరణ పొందిన గ్యాక్ ఫ్రూట్‌ని పండించాలని నిశ్చయించుకున్నాడు. కేరళలో ఓ రైతు ఈ పంట పండిస్తున్నాడని తెలసుకొని అతడి ద్వారా మొక్కలు సేకరించాడు. అనంతరం అనేక పరిశోధనలు చేసి 2023లో గ్యాక్ ఫ్రూట్ సాగుచేయడం మొదలుపెట్టాడు.
గ్యాక్ ఫ్రూట్ అరకిలో నుంచి కిలో బరువు : గ్యాక్ ఫ్రూట్ అరకిలో నుంచి కిలో బరువుంటుంది. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. క్రమంగా పసుపు, నారింజ, ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది కాయగా ఉన్నప్పుడు సూప్‌లు, కూరల్లో వేసుకుంటారు. ఈ గ్యాక్ ప్రూట్ తినడం వల్ల డిప్రెషన్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి దరి చేరవని ఈ యువరైతు తెలుపుతున్నాడు.
ఇందులో లభించే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు జీర్ణశక్తి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఈ పండులో అధిక పోషకాలు ఉండటం వల్ల దీన్ని స్వర్గ ఫలం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ పండుకు రూ.500 నుంచి రూ.1500 వరకు డిమాండ్ ఉందన్నారు. ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకూ కాపునిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
సంవత్సరంలో 2సార్లు పంట దిగుబడి సంవత్సరంలో 2సార్లు పంట దిగుబడి సాధించాడీ యువరైతు. పలు రాష్ట్రాల్లో ఉద్యానవన ప్రదర్శనల్లో పాల్గొని అక్కడి రైతులకు గ్యాక్ ఫ్రూట్ సాగు విధానాలు, మార్కెట్లో ఈ ఫ్రూట్‌కు ఉన్న డిమాండ్ గురించి తెలుపుతున్నాడు. డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత ఖరీదైన మెకడేమియాతో పాటు అబియూ, డ్రాగన్, అవకాడో, యాపిల్, కాక్టస్, లక్ష్మణఫలం సాగు చేసేందుకు కడియం నర్సరీ నుంచి మొక్కలను సేకరించాడు. అందరి రైతులా కాకుండా వినూత్నంగా ఆలోచించి గ్యాక్ ఫ్రూట్ పంట పండిస్తూ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు వెంకటేశ్. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పండ్ల సాగుతో యువరైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.