Ex CM KCR To Visit Telangana Bhavan : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. తన పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. పాస్‌పోర్టు కార్యాలయం నుంచి కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ అక్కడికి వెళ్లారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేళ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
కేసీఆర్ దిశానిర్దేశం : కేసీఆర్ ఉద్యమ పంథాను ఎంచుకొని టీఆర్ఎస్ పేరిట 2001లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఏప్రిల్ నాటికి 24 ఏళ్లు పూర్తయి పాతికేళ్లలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై బీఆర్ఎస్ భవన్లో సమీక్ష నిర్వహించారు. పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.