Jagadish reddy fires on Congress : కాంగ్రెస్ మరోమారు రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు శ్రీకారం చుట్టిందని, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి(Jagadish reddy) దుయ్యబట్టారు. తెలంగాణ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక, ఎలా మోసం చేశారో ప్రజలకు అర్థమైందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే మాట మారుస్తున్నారని, హామీల నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు అనుభవంలోకి వచ్చాయన్నారు.
తెలంగాణ నుంచే దేశం మొత్తాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పార్టీ మారిన వారిని పక్కన పెట్టుకొని, పార్టీ మారితే ఆ క్షణంలోనే సభ్యత్వం రద్దు చేస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. నేరస్తుణ్ని పక్కన కూర్చో పెట్టుకొని, విచారణ చేసి శిక్ష వేస్తామన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. అనర్హతా పిటిషన్ తీసుకునేందుకు కూడా సభాపతి వెనకాడుతున్నారని, కాంగ్రెస్ హామీలు నీటి బుడగలే అని అర్థం అవుతోందన్నారు.
Lok Sabha Elections 2024 : మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వని వారు, ఏడాదికి లక్ష ఇస్తారా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి(Rahul Gandhi) తెలివి, జ్ఞానం ఉన్నా వెంటనే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని లేదా అనర్హత వేటు వేయాలన్నారు. 2014కు ముందు వందలాది మంది చనిపోయిన పరిస్థితులు మళ్లీ వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ అనుమతి తీసుకొని రైతుల కోసం ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఇంటింటికీ మంచినీరు, కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. బూతులతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని ఆయన దుయ్యబట్టారు. నీరు ఉన్నా కూడా ఎత్తిపోయకుండా పంటలు ఎండగొట్టింది మీరు కాదా? అని, కేసీఆర్ వస్తున్నారంటే లాగులు తడిసి నీరు ఎత్తిపోశారని పేర్కొన్నారు. కృష్ణాబోర్డుతో సంబంధం లేకుండా కేసీఆర్ నీరు ఇచ్చి పంటలు కాపాడారని, వంద రోజుల్లోనే జేబు, దోపిడీ దొంగలుగా వసూలు చేసి దిల్లీకి కప్పం కడుతున్నారని దుయ్యబట్టారు.
జానారెడ్డి చేతకాని వాడా, అసమర్థుడా అని ఆయన్నే అడగాలని, జానారెడ్డి, రేవంత్‌రెడ్డిలో ఎవరు మంచివారో, చెడ్డవారో వాళ్లే తేల్చుకోవాలని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎగిరిపడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధ్య మానేరు కట్ట తెగిన అంశంపై విచారణ చేయించాలని, ఆ కంపెనీ ఎవరిదో తేల్చాలని కోరారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామని గత పదేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ అంటూనే ఉన్నాయని, రేవంత్ రెడ్డి, ఆయన దిల్లీ బాస్ ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారని, రైతులకు నీళ్లు, తాగడానికి మంచి నీరు అడిగితే జైల్లో వేస్తారా? అని ప్రశ్నించారు.
"తెలంగాణ నుంచే దేశం మొత్తాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పార్టీ మారిన వారిని పక్కన పెట్టుకొని, పార్టీ మారితే ఆ క్షణంలోనే సభ్యత్వం రద్దు చేస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదం. నేరస్తుణ్ని పక్కన కూర్చో పెట్టుకొని, విచారణ చేసి శిక్ష వేస్తామన్నట్లు కాంగ్రెస్ తీరు ఉంది". - జగదీశ్‌రెడ్డి, మాజీమంత్రి
వసూళ్లపై ఉన్నంత శ్రద్ద ప్రభుత్వానికి రైతుల సమస్యలపై లేదు : జగదీశ్ రెడ్డి
కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి