Migratory Birds On Kakinada Beach : పొడ వాటి మెడ, కాళ్లు చూసి ఇవి కొంగలు అనుకుంటే పొరపాటే. ఇవన్నీ వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన విదేశీ పక్షులు. ఖండాల సరిహద్దులు దాటుకుని వేల కిలోమీటర్లు ప్రయాణించి వలస వచ్చిన విదేశీ పక్షుల సంగీతం వినిపించినట్లు కిలకిల రావాలు, ఆకాశానికి రంగేసినట్లు కనుచూపుమేర అందాలు. వాటి సోయగాలు, అవి రెక్కలతో నీటిపైన, ఆకాశంలో చేసే విచిత్ర విన్యాసాల సందడి చూడాలంటే కాకినాడ సముద్ర తీరంలోకి వెళ్లి చూడాల్సిందే.
సముద్రంలో పక్షుల సందడి : హాంకాంగ్, చైనా, కంబోడియా, మలేసియా, బంగ్లాదేశ్ లాంటి ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉండే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తుంటాయి. ఇలాగే కాకినాడ సముద్రతీరంలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇక్కడ ఆరునెలల పాటు ఉండి తిరిగి వెళ్తాయని సమాచారం. ఇవి ఐబిస్ కుటుంబానికి చెందిన థ్రెస్కియోర్నితిడే జాతికి చెందినవి. వీటి తల, కాళ్ల భాగం నల్లగా ఉండి ముక్కు పొడవుగా ఉంటుంది. బ్లాక్‌హెడెడ్ ఐబిస్‌గా వీటిని పేర్కొంటారు. స్థానికంగా తెల్ల కొంకణాయిలుగా పిలుస్తారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఇవీ ఉన్నాయని రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు కె.బాబు తెలిపారు.
ఆహార అన్వేషణ : సైబీరియా, మలేసియా, రష్యా, చైనా వంటి దేశాల్లో పక్షులు ఉండే ప్రదేశాలు ఈ సీజన్‌లో మంచుతో కప్పేసి ఉంటాయి. ఆహార కొరత, ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్టోబరు నుంచి మార్చి వరకు ఇక్కడికి చేరుకుంటాయి. నత్తలు, చేపలు, జూప్లాంట్, వామస్ ఆహారాన్ని ఇవి అధికంగా తింటాయి.
జనవరిలో గణన : ఏటా జనవరిలో విదేశాల నుంచి వచ్చే పక్షులను లెక్కిస్తారు. ఇందులో వివిధ సంస్థలు పాల్గొంటాయి. ఒక్కోచోట అయిదుగురు చొప్పున 12 ప్రాంతాల్లో 12 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక కెమెరాల ద్వారా పక్షులను గుర్తిస్తారు. 2011లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఏటా కొనసాగుతోంది. 2016 నుంచి పక్షుల సంఖ్య పెరుగుదల కనిపిస్తోంది. స్కిమ్మర్ అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరడం చేరడం గమనార్హం.
ఆ ప్రాంతానికి విశిష్ట అతిథులు..! రాకపోతే ఆ ఏడాది ప్రకృతి విపత్తే..!!