Siddipet Suicide Incident : ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన అన్నపై సొంత తమ్ముడు దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అన్న పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన సిద్దిపేటలో ఆదివారం (నవంబరు 10) వెలుగు చూసింది. సిద్దిపేటకు చెందిన తేలు సత్యం (49) తన కుమారుడు అన్విష్ నందన్ (8), కుమార్తె త్రివర్ణ హాసిని(6)లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని సిద్దిపేట టూటౌన్ పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం, అతని సోదరుడు శ్రీనివాస్ తల్లి లచ్చవ్వతో కలిసి సిద్దిపేటలోని వివేకానంద నగర్ కాలనీలో కొన్నాళ్ల క్రితం స్థిరపడ్డారు. సత్యంకు మొదటగా స్వరూపతో వివాహం కాగా, ఆమె పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సత్యం 2016లో పట్టణానికి చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అన్విష్ నందన్, కుమార్తె త్రివర్ణ హాసిని ఉన్నారు.
వివాదం ఆర్థికంగానే : సత్యం తన సోదరుడు శ్రీనివాస్ పెళ్లికి రూ.లక్షన్నర అప్పు తెచ్చారు. అనంతరం అవసరం నిమిత్తం మరో రూ.4 లక్షలు శ్రీనివాస్‌కు ఇచ్చారు. ఈ క్రమంలో వీరి మధ్య నిరంతరం గొడవలు కావడంతో శ్రీనివాస్ తన భార్య, తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు. సత్యం ఏడాది కిందట అనారోగ్యానికి గురయ్యారు. తన సర్జరీకి రూ.9 లక్షల 80 వేలు ఖర్చయ్యాయి. దీంతో తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, నెల రోజుల క్రితం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి గతంలో తాను ఇచ్చిన సొమ్ము మొత్తం రూ.5 లక్షల 50 వేలు ఇవ్వాలని అడిగారు.
శ్రీనివాస్ తాను ఇవ్వనంటూ తెగేసి చెప్పి అన్నపై తీవ్రంగా దుర్భాషలాడి దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన సత్యం ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం (నవంబరు 09) సాయంత్రం పట్టణ శివారులోని చింతల్ చెరువు దగ్గరకు ద్విచక్రవాహంపై వెళ్లారు. తమ ముగ్గురి చావునకు తన సొంత సోదరుడు శ్రీనివాసే కారణమంటూ సెల్ఫీ వీడియోను తీసి, సూసైడ్ నోట్‌ను రాసి వాహనంలో పెట్టి తన పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీసి సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు. సత్యం భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మధు, సీఐ ఉపేందర్‌లు వెల్లడించారు.
వివాహమైన నెల నుంచే వేధింపులు - సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య - అతడి పనేనా? - Software Woman Murdered in Miyapur