Farmers Interest in Private Markets for Selling Crops in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం రాక కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి ఈ యాసంగి సీజన్లో 6 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 800కు పైగా కొనుగోలు కేంద్రాలను సైతం తెరిచింది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.
ఈసారి ఉమ్మడి జిల్లాలో సన్నరకమే అధికంగా పండించగా, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల రైతులు అధికంగా కర్ణాటక, రాయచూరు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్మారు. మిగిలిన చోట్ల మధ్య దళారులు, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులకు రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర రూ.2,200 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్‌లో గరిష్ఠంగా రూ.2,700 వరకూ కొనుగోలు చేయడంతో ఎక్కువ మంది రైతులు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు.
"గతేడాది కంటే ఈసారి మార్కెట్‌కు అధికంగా వడ్లు వచ్చాయి. దాదాపు ఈ సంవత్సరం రెండు లక్షలకు పైగా వరి ధాన్యం మార్కెట్‌కు వచ్చింది. వరి ధర కూడా బాగానే పలుకుతుంది. రైతులు కూడా కోతలు కోసి డైరెక్ట్‌గా మార్కెట్‌కే తీసుకువస్తున్నారు. వాళ్లకు ఎండ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. పచ్చిగా ఉంటే మార్కెట్ షెడ్లల్లో ధాన్యాన్ని ఎండబెట్టుకుంటున్నారు." - విజయ్‌చందర్, మార్కెట్ కార్యదర్శి, బాదేపల్లి
మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్, బాదేపల్లి, దేవరకద్ర, నవాబు పేట, బాలనగర్ వ్యవసాయ మార్కెట్లున్నాయి. గతేడాది, ఈ సమయానికి తెలంగాణ సోనా రకం లక్షా 13వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ ఏడాది లక్షా 94వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఒక్క బాదేపల్లి మార్కెట్లోనే గతేడాది 33వేల క్వింటాళ్ల ధాన్యం కొంటే ఈ ఏడాది యాసంగి సీజన్లో సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నవాబుపేట మార్కెట్‌లో గతేడాది యాసంగిలో సోనా రకం 500 క్వింటాళ్ల కొనుగోళ్లు సాగితే, ఈ ఏడాది 17వేల క్వింటాళ్లు కొన్నారు. హంస రకాలు మాత్రం పోయిన ఏడాది 27వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ఈసారి 4వేల క్వింటాళ్లే వచ్చాయి. కనీస మద్దతు ధర కంటే అధికంగా ధరలు పలుకుతుండటంతో రైతులు మార్కెట్లకు వస్తున్నారు.
దీనికి తోడు తేమ శాతంతో సంబంధం లేకుండా కోసుకొచ్చిన ధాన్యాన్ని నేరుగా అమ్మినా, వ్యాపారులు మంచి ధర ఇవ్వడంతో రైతులు మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం బాదేపల్లి, మహబూబ్‌నగర్ మార్కెట్లకు ఇంకా ధాన్యం రాక కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకూ ధాన్యం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు కురుస్తుండంతో ఎంతో కొంతకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్లకు మరో 15రోజుల వరకూ ధాన్యం రాక కొనసాగనున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా మార్కెట్‌లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. వాన రాకను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు ధాన్యాన్ని కొనగోలు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.