Family Members Missing At Bowenpally : గర్భిణీగా ఉన్న భార్యతో పాటు ఇద్దరు పిల్లలతో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి కుటుంబంతో సహా అదృశ్యమైన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై అతడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే ఓల్డ్ బోయిన్ పల్లి బడాగూడకు చెందిన అహ్మద్ బేగ్ (30), భార్య సనా సుల్తానా (28), పిల్లలు అర్హాన్ (4), జకియా (9 నెలలు)లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
అహ్మద్ బేగ్ ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అహ్మద్ బేగ్ భార్య సనా సుల్తానా ఆరు నెలల గర్భిణీ. ఆమె కొద్ది రోజులుగా ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున నగర్ కాలనీలోని పుట్టింట్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 29న అహ్మద్ బేగ్ భార్యాపిల్లలను తన ఇంటికి తీసుకువచ్చాడు. కొద్దిసేపటికే భార్యకు వైద్య పరీక్షలు చేయించడానికి పిల్లలను వెంటబెట్టుకొని వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో అహ్మద్ బేగ్ కుటుంబసభ్యులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బెంగళూరులో బాలుడు మిస్సింగ్- హైదరాబాద్ మెట్రోలో ప్రత్యక్షం