Elephant Attack on Farmers : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలిసారిగా ఏనుగు అలజడి, జిల్లా వాసులను వణికిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో పులులు ప్రవేశించి మనుషులు, జంతువులపై దాడి చేసిన ఘటనలు మాత్రమే చోటుచేసుకోగా, మొదటిసారి ఓ గజరాజు విరుచుకుపడి బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం చింతలమానెపల్లి మండలంలో ఓ అన్నదాతపై దాడి చేసి చంపేయగా, ఈ తెల్లవారుజామున పెంచికల్పేట మండలంలో మరో రైతు ప్రాణాలు తీసింది.
Elephant Attack in Komaram Bheem : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి అటవీ ప్రాంతంలో నుంచి ఓ ఏనుగు బూరేపల్లి గ్రామ శివారులోకి ప్రవేశించి, సమీపంలోని మిర్చి తోటలోకి చొరబడింది. పొలంలో తోట పని చేస్తున్న అన్నూరి శంకర్ అనే రైతుపై ఒక్కసారిగా గజరాజు విరుచుకుపడటంతో (Elephant Attack), ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఎప్పుడూ లేనివిధంగా ఏనుగు అలజడితో పరిసర గ్రామాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాయి.
పదో తరగతి విద్యార్థిపై దాడి చేసి చంపిన ఏనుగు.. హెలికాప్టర్ పంపిన సీఎం!
అటు ఏనుగు కోసం గాలిస్తున్న తరుణంలోనే తెల్లవారుజామున మరో రైతుపై దాడి చేసి చంపేసింది. పెంచికల్పేట మండలం కొండపల్లిలో రైతు తారు పోషన్నపై దాడి చేసి చంపేసింది. తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన ఆయన, ఉదయం విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో అడుగుల గుర్తులు, మృతుడి శరీరంపై ఉన్న గాయాలను గమనించి, గజరాజు చంపేసినట్లు నిర్ధారించారు.
ఇద్దరి రైతులను బలి తీసుకున్న ఏనుగు : దాడి చేసిన గజరాజు మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత నదిని దాటి జిల్లాలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని సిర్పూర్, బెజ్జూర్, చింతలమానేపల్లి, కౌటాల మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. వీటి వెంట ప్రాణహిత నది తీరం ఉంది. అవతల దట్టమైన అటవీ ప్రాంతం ఉండగా, అక్కడి నుంచి పులులు, ఇతర జంతువులు జిల్లాలోకి ప్రవేశిస్తుంటాయి.
రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. దీనిలో నుంచి ఒకటి విడిపోయి అటవీ ప్రాంతం మీదుగా ప్రాణహిత నుంచి జిల్లాలోకి ప్రవేశించినట్లు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే గజరాజు ఇద్దరు రైతులను బలి తీసుకోవటం కలకలం రేపింది.
Elephant Attack on Farmers in Telangana : పంట చేలకు వచ్చిన గజరాజు ఎప్పుడు ఊళ్లోకి చొరబడి ఏం అలజడి సృష్టిస్తుందోనని పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జనావాసాల్లోకి ఇది రాకుండా కట్టడి చేసేందుకు అటవీ శాఖ అధికారులంతా ఆ ప్రాంతంలోనే తిష్ట వేశారు. గత మూడేళ్లలో జిల్లాలో ప్రవేశించిన పులుల దాడిలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందగా, రెండ్రోజుల వ్యవధిలోనే ఏనుగు బీభత్సానికి ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
కిరాణా షాపులో ఏనుగు 'దొంగతనం'!.. షట్టర్ ధ్వంసం చేసి అరటిపళ్లు, కూరగాయలు తిన్న గజరాజు
అటవీ శాఖ అధికారులు ఎలాగైనా ఏనుగును బంధించాలని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. గజరాజు (Elephant Attack in Telangana )వచ్చి రైతులపై దాడి చేసిన విషయం అంతటా వ్యాపించడంతో సమీప గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ గ్రామంలో చొరబడితే తమ పరిస్థితి ఏంటని జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీసుల సహకారంతో అడవిని గాలిస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ : ఈ క్రమంలోనే కుమురం భీం జిల్లాలో ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు వస్తే గుంపులుగా వెళ్లాలని సూచించారు. గజరాజు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రకటించారు.
నిద్రపోతున్న వృద్ధురాలిపై ఏనుగు దాడి- వెంటనే పక్కింటికి వెళ్లి!
రైతు కూలీలపై ఏనుగు దాడి- త్రుటిలో తప్పించుకొన్న వ్యక్తి- లైవ్ వీడియో