Drunk Woman Throws Snake on Conductor in Hyderabad : మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పలు చోట్లు సీట్ల కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుంటే, బస్సు ఆపడం లేదనో ఇతర కారణాలతో డ్రైవర్, కండక్టర్‌తో మహిళలకు వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బస్సు ఎక్కిన ఓ మహిళ బ్యానెట్‌పై కూర్చోబోయింది, కండక్టర్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటూ మహిళా కండక్టర్లు కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగన ఓ ఘటన ఏకంగా పోలీస్ కేసు వరకు వెళ్లింది. ఏమైందంటే?
హైదరాబాద్ విద్యానగర్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడో మారుమూల పల్లె కాదు. ఏకంగా హైదరాబాద్ మహానగరంలో ఈ తరహా ఘటన జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదంటూ మద్యం మత్తులో ఓ మహిళ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగులగొట్టింది. తన వెంట తీసుకొచ్చిన పాముతో కండక్టర్‌ను బెదిరిస్తూ విద్యానగర్‌లో ప్రధాన రహదారిపై గందరగోళం సృష్టించింది.
బీర్ బాటిల్‌తో బస్సు అద్దం పగులకొట్టి : నగరంలోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్ ఫాతిమ బీబీ అలియాస్ అసీం గురువారం సాయంత్రం విద్యానగర్ చౌరస్తాలో దిల్‌సుఖ్‌నగర్ డిపో బస్సును ఆపాలంటూ చెయ్యెత్తింది. స్థానికంగా మూలమలుపు ఉండటం రద్దీ కారణంగా డ్రైవర్ అక్కడ బస్సు ఆపలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాతో బస్సు వెనుక అద్దం పగలగొట్టింది. అనంతరం డ్రైవర్ బస్సును ఆపడంతో కండక్టర్ స్వప్న బస్సు దిగి బేగం వద్దకు వెళ్లి పారిపోకుండా గట్టిగా పట్టుకుంది. వదిలించుకోవాలని ఆమె ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో తన వద్ద ఉన్న సంచిలో పాము ఉందంటూ కండక్టర్‌ను బెదిరించింది.
ఆ తర్వాత నాలుగు అడుగులు పొడవున్న జెర్రిపోతు పామును బయటికి తీసి కండక్టర్‌పై విసిరింది. అది స్వప్న ఒంటిమీద పడి నేలపైకి జారిపోయింది. ప్రయాణికులు, స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బేగంను అదుపులోకి తీసుకున్నారు. పాము కోసం వెతికినా దొరకలేదు. ఆమె మద్యం మత్తులో ఉందని నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హాయిగా నిద్రిస్తున్న చిన్నారికి పాము కాటు - ఆరు రోజులు ప్రాణాలతో పోరాడి చివరకు?