Drugs and Drive Test in Telangana : మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసులు ఎక్కడికక్కడ కళ్లెం వేస్తున్నా రాష్ట్రంలో అవి చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. మొన్నటి దాకా వాటి సరఫరాపై నిఘా పెట్టిన అధికారులు ఇప్పుడు దాంతోపాటు వినియోగంపైనా దృష్టి సారించనున్నారు. డ్రగ్స్‌ను సేవించే వారిని పట్టుకుంటే వినియోగాన్ని కాస్తయినా నియంత్రించవచ్చని భావిస్తున్న పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ఉపయోగించే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు(Drunk and Drive Test) మాదిరిగా, ఒక కిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదే డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షల కిట్. దీనిని రాష్ట్ర పోలీస్ శాఖ తెరపైకి తీసుకువచ్చింది. డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షల ద్వారా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయిని సేవించే వారిని గుర్తించవచ్చు.
దీని కోసం 'ఎబోన్ యూరిన్ కప్'(Ebon Urine Cup) యంత్రంతో పరీక్షలు జరపాలని పోలీసులు తెలిపారు. ఈ కిట్‌ను తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్‌న్యాబ్) సమకూర్చింది. ఆ కిట్లను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించింది. ఈ యంత్రం సాయంతో ఏ విధంగా గంజాయి తాగే వారిని గుర్తించవచ్చో సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. కానీ ఇప్పటికే కొన్ని ఠాణాల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది తనిఖీలను మొదలు పెట్టారు.
బాలికలకు డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీల్లో వ్యభిచారం! - జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠా అరాచకాలు
Drugs Control in Telangana : ఈ మేరకు డోర్నకల్ సీఐ ఉపేంద్ర రావు, ఎస్సై సంతోష్‌రావులు సోమవారం డోర్నకల్‌లో డ్రగ్స్ అండ్ డ్రైవ్(Drugs and Drive Test) పరీక్షలు నిర్వహించారు. గార్ల ఎస్సై జీనత్‌కుమార్ రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా కనిపించే, తిరుగుతున్న యువకులకు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్ష నిర్వహించిన అనంతరం అందులో పాజిటివ్ వస్తే మాత్రం అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే అనుమానం వచ్చిన పక్షంలో కిట్ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తున్నామని డోర్నకల్ సీఐ ఉపేంద్రరావు తెలిపారు. ఈ పరికరం ద్వారా పరీక్ష చేసినప్పుడు రెండు ఎర్ర గీతలు వస్తే నెగెటివ్‌గా, ఒకటే గీత కనిపిస్తే పాజిటివ్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. పాజిటివ్ వస్తే మాత్రం అదుపులోకి తీసుకొని అవసరమైతే తదుపరి పరీక్షలు కూడా నిర్వహిస్తామని సీఐ ఉపేంద్రరావు తెలిపారు.
డ్రగ్స్ తీసుకున్నారో దొరికిపోతారు - 2 నిమిషాల్లో మిమ్మల్ని ఇలా పట్టేస్తారు
గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ - పక్కా సమాచారంతో అరెస్టు చేసిన పోలీసులు