Driver Looted Rs.2crore and 28tola Gold From Owners House in Maktha : తన ఇంట్లో రూ.15 లక్షలు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేయగా, చోరీ చేసిన వారు మాత్రం రూ.2.02 కోట్లు ఉన్నాయని చెప్పిన విడ్డూర ఘటన ఘట్కేసర్ శివారు మక్త గ్రామంలో చోటుచేసుకుంది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధి మక్త గ్రామానికి చెందిన పాల వ్యాపారి నాగభూషణం (70) ఈ నెల 22వ తేదీన తన ఇంట్లో భారీ చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తం రూ.2.02 కోట్ల నగదు, 28 తులాల బంగారం అపహరణకు గురైనట్లు చెప్పాడు. అయినా తొలిరోజు ఫిర్యాదు ఇవ్వలేదు. దాంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు.
మరుసటి రోజు వెళ్లి రూ.15 లక్షలు పోయినట్లు పీఎస్లో ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్పెషల్ బృందాలతో సీసీ కెమెరాలను తనిఖీ చేయగా, ఓ ఆటోలో ముగ్గురు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా సుమారు 200పైగా సీసీ కెమెరాలను పరిశీలించి, ఆటో నెంబర్ ద్వారా పవన్, మహేశ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ డ్రైవర్ రవి స్నేహితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.
నాగభూషణం వద్ద భారీగా డబ్బు ఉందని, తన సూచన మేరకే చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. నాగభూషణం ఇంట్లో లేడని డ్రైవర్ రవి సమాచారం ఇవ్వగా, ఆటో డ్రైవర్ అయిన మహేశ్తో కలిసి చోరీ చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరికి మరో నలుగురు సహకరించినట్లు గుర్తించి, వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగభూషణం రూ.15 లక్షలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయగా, నిందితుల్లో ఒకరు చేసిన సంచిలో దాదాపు రూ.2 కోట్లు ఉన్నాయని, మరో నిందితుడు రూ.1.7 కోట్లు ఉన్నాయని వెల్లడించారని సమాచారం. కాగా నగదు ఎక్కడ ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు.