Tirumala Tirupati Devasthanam : ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి కోట్ల మంది భక్తులు తపిస్తుంటారు. ఇష్ట దైవాన్ని కనులారా చూసి జీవితంలో మంచి అనూభూతిని పొందుతారు. తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు, టికెట్లపై, అవకాశాలపై భక్తులకు చాలా సందేహాలు వస్తుంటాయి. శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో టీటీడీ కల్పిస్తున్న అవకాశాలను కోసం వారు ఆరాటపడుతుంటారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ రకరకాల ఏర్పాట్లను చేస్తోంది. శ్రీనివాసుడి దర్శనానికి ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఇతర వివరాలపై ‘ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం.
తిరుమల తిరుపతికి శ్రీవారి దర్శనం కోసం పక్కా ప్లాన్‌తో వచ్చే భక్తులకు ఆ దైవ దర్శనం దుర్లభమేమీ కాదు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు కొంత ఖర్చులను తప్పించుకోవచ్చు. గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి చూసే సమస్య నుంచి దూరం కావచ్చు. దర్శనాన్ని ఇంకా సులభంగా సౌకర్యంగా చేసుకోవచ్చు. దర్శన మార్గాలివి.
శ్రీవారి సర్వదర్శనం : తిరుమల తిరుపతికి వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా శ్రీవారిని ఉచితంగా సర్వదర్శనంలో భాగంగా దర్శించుకోవచ్చు. వీరిని క్యూలైన్ల నుంచి కంపార్ట్మెంట్ల ద్వారా పంపుతారు. అక్కడి నుంచి వెళ్లామంటే స్వామివారి దర్శనం అవుతుంది . ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటుచేసిన తొమ్మిది కంపార్టుమెంట్లలో (ఒక్కో దానిలో 900 మంది) దర్శనానికి ఎదురు చూడాల్సి ఉంటుంది. అవీ నిండితే క్యూలైన్లలో నిల్చోవాల్సిందే.
క్యూలైన్ నుంచి వైకుంఠం-2లోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకు అవుతుందనే కాలం ఆ టోకెన్లో ముందుగానే ముద్రించి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ సమయం ఉంటే అక్కడి నుంచి బయటకు వెళ్లి తమకు కేటాయించిన దర్శనం సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధి నుంచి మ్యూజియం వెళ్లే మార్గంలో ఉన్న దారిలో కంపార్టుమెంటులోకి వెళ్లవచ్చు.
- సౌకర్యాలు
కంపార్టుమెంట్లలో దర్శనానికి వేచి చూసే భక్తుల కోసం భోజనం, టీ, పాలు ఏర్పాటు ఉంటుంది. అవసరార్థులకు వైద్య సౌకర్యాలు లభిస్తాయి. క్యూలైన్లలోని వారికి కూడా ఆహారం, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
- స్లాటెడ్ సర్వదర్శనం
సర్వదర్శనం భక్తులకే నిర్దేశించిన సమయాన్ని తెలియజేస్తూ దర్శనం టోకెన్ (టైమ్‌స్లాట్) ఇస్తారు. తమకు కేటాయించిన సమయంలో వీరు వైకుంఠం-1 నుంచి కంపార్టుమెంట్లలోకి ప్రవేశించాలి.
- దర్శనానికి వేచి చూడాల్సిన సమయం : సాధారణ రోజుల్లో నాలుగు గంటలు పడుతుంది. కానీ రద్దీ రోజుల్లో 7 నుంచి 8 గంటలు తప్పక వేచి ఉండాల్సిందే.
- టికెట్లు ఎక్కడెక్కడ? : నాలుగు చోట్ల టికెట్లు లభిస్తాయి. తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీవారి మెట్టు.
- ఎప్పుడు ఇస్తారు? రోజుకు ఎన్ని టోకెన్లు
తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలవుతుంది. తిరుపతిలో రోజుకు 14 వేల టోకెన్లను ఇస్తారు. శ్రీవారిమెట్టు వద్ద 6 వేలదాకా ఉంటాయి
- ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ రూ.300
సుమారు మూడు నెలల ముందు ఆన్‌లైన్‌లో టికెట్లను ఉంచుతారు. టికెట్‌లో సూచించిన సమయానికి వైకుంఠం-1 వద్దకు చేరుకోవాలి. 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు టికెట్ అవసరం లేదు.
- టికెట్లు బుక్ చేసుకోవాల్సిన వెబ్సైట్: https://ttdevasthanams.ap.gov.in
ప్రవాసాంధ్రులకు ప్రత్యేక దర్శనం : పాస్‌పోర్టుపై ఇమ్మిగ్రేషన్ చూసి నెలలోపలే తిరిగి వెళ్లే వారు ఉంటే అలాంటి భక్తులుంటే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. వీరు పాస్‌పోర్టు, ఆధార్ కార్డు సంబంధిత కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) ద్వారా రోజుకు రెండు రెకమెండేషన్ లేఖలు ఇస్తారు. ఒక్కో లెటర్‌పై ఆరుగురికి ప్రవేశ అనుమతి ఉంటుంది.
- దరఖాస్తు ఎక్కడ?: సుపథం వద్ద
- టికెట్: రూ.300
- దర్శనానికి పట్టే సమయం: సుమారు 3 నుంచి 4 గంటలు.
శ్రీవాణి దర్శనం.. టికెట్ రూ.10 వేలు : శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు రూ.10 వేల విరాళమిచ్చే వారి నుంచి అదనంగా మరో రూ.500 తీసుకుని టికెట్ ఇచ్చి ఒకరికి ఆ దైవ దర్శనం కల్పిస్తారు.
రోజుకు ఎన్ని టికెట్లు ఇస్తారు?: 1,500
టికెట్లు ఎక్కడ? : రేణిగుంట ఎయిర్పోర్ట్, తిరుమలలో ఇచ్చే టికెట్లతో మరుసటి రోజు కూడా దర్శనం చేసుకోవచ్చు. మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.
దర్శనానికి పట్టే సమయం : కేవలం గంట నుంచి రెండు గంటలు.
శ్రీనివాస దివ్యానుగ్రహహోమం ఇద్దరికి దర్శనం : తిరుపతిలోని అలిపిరి వద్దనున్న సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఘనంగా నిర్వహిస్తారు. దీనికి వేయ్యి చెల్లించి ఆన్‌లైన్‌లో టికెట్ కోనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇక్కడే టికెట్లు ఇస్తారు.
- దర్శనానికి పట్టే సమయం: 3 నుంచి 4 గంటలు.
సిఫార్సు దర్శనం (బ్రేక్ దర్శనం)
- ఏపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే లెటర్లపై బ్రేక్ దర్శనంతో పాటు ఓ గదిని కూడా ఇస్తారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపైనా కూడా బ్రేక్ దర్శనం, గది లభిస్తుంది.
రోజుకు ఒక్కొక్కరికి అనుమతించే లేఖలు : ప్రజాప్రతినిధులైతే రోజుకు ఒక లేఖను అనుమతిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకైతే వారానికి రెండు చొప్పున ప్రవేశం కల్పిస్తారు.
- ఒక్కో లేఖపై గరిష్ఠంగా ఎంతమందికి ప్రవేశం: ఆరుగురు.
- దర్శనానికి పట్టే సమయం: సుమారు 1 నుంచి 2 గంటలు.
నవదంపతులైతే : తిరుమలలో వివాహం చేసుకున్న నూతన దంపతులకు ఆరు టికెట్లు (వరుడు, వధువు, వారి తల్లిదండ్రులకు) ఇస్తారు. సుపథం ద్వారా లోనికి వెళ్లి సులభంగా దర్శనం చేసుకోవచ్చు. నవదంపతులు కల్యాణోత్సవం (టికెట్ రూ.1,000)పైనా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవచ్చు. అయితే వీరు వారంలోపు పెళ్లి చేసుకున్నట్లు వివాహ సర్టిఫికేట్ (పెళ్లిపత్రిక, ఫొటోలు, ఆధార్)ను సీఆర్వో ఆఫీస్‌లో చూపి ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో నమోదు చేసుకోవాలి. అనంతరం జరిగే వివాహానికి (రోజుకు 25) టికెట్లు ఇస్తారు. కల్యాణం అయిన అనంతరం స్వామివారి దర్శనం కల్పిస్తారు.
దర్శనానికి పట్టే సమయం : 3 నుంచి 4 గంటలు పడుతుంది.
వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు : శ్రీవారి దర్శనానికి చిన్నపిల్లలున్న దంపతులకు ప్రత్యేకంగా వారికీ కోటా ఉంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు దాదాపు మూడు నెలల ముందు ఆన్‌లైన్‌లో బాబు లేదా పాప పుట్టిన తేదీ సర్టిఫికేట్‌తో బుక్ చేసుకోవాలి. ప్రతి నెలా వీరికి ప్రత్యేకమైన కోటా విడుదల చేస్తారు. శ్రీవారి ఆలయం ముందు నుంచి వీరి కోసం ప్రత్యేక క్యూలైన్ ఉంటుంది.
వృద్ధులు, దివ్యాంగులు మూడు నెలల ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. సాయంత్రం 3 గంటలకు వీరికి ప్రత్యేక స్లాట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌లో రోజుకు 750 టికెట్ల వరకు అందుబాటులో ఉంటున్నాయి. అనారోగ్యంతో ఉన్న వారిని దేవస్థానం బయోమెట్రిక్(ఫింగర్ ప్రింట్) ద్వారం గుండా లోనికి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం-1 వద్దనున్న టికెట్ చెకింగ్ సిబ్బందికి రోగి, ఆయన వెంటన్న కుటుంబ సభ్యులు తెలియజేయాలి.
సైనికులు రక్తదానం చేసేవారు
- భారత సైన్యంలో పనిచేసే వారికి (ఫీల్డ్‌స్టాఫ్‌కు మాత్రమే) రూ.300 టికెట్ ఇస్తారు. తమ గుర్తింపు కార్డు చూపి టికెట్ తీసుకోవచ్చు.
- అశ్వనీ హస్పిటల్లో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలోకి ప్రవేశం కల్పిస్తారు. వైద్యుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రం వారికి చూపిస్తే సరిపోతుంది.
దర్శనానికి పట్టే సమయం: 3 నుంచి 4 గంటలు.
ఎక్కడి నుంచి ఎలా ప్రవేశం?
సర్వదర్శనం: వైకుంఠం-2
ఎస్‌ఎస్‌డీ, ఎస్‌ఈడీ టోకెన్లు, బ్రేక్‌దర్శనం, శ్రీవాణి: వైకుంఠం-1
సైనికులు, బోర్డు సభ్యులు, కల్యాణోత్సవం, ఎన్‌ఆర్‌ఐ, చంటిబిడ్డలున్న వారు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేసినవారికి సుపథం ప్రవేశ ద్వారా దర్శనానికి అనుమతినిస్తారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు - టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే
తిరుమల వాసులకు గుడ్‌న్యూస్ - ప్రతినెలా ఆరోజు శ్రీవారి దర్శనం - టోకెన్లు ఎక్కడిస్తారంటే?