Bhatti Vikramarka On Singareni Coal Mines : సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని, సింగరేణి తెలంగాణకే తలమానికమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్, 22 వేలమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోందని వివరించారు. ఖమ్మం జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన భట్టి సింగరేణి బొగ్గు గనుల వేలంపై మాట్లాడారు.
2030 కల్లా 15 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుందని, గనుల చట్టానికి కేంద్రం సవరణలు తీసుకొచ్చి ఆమోదించుకుందని మంత్రి భట్టి పేర్కొన్నారు. బొగ్గు గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనేలా చట్టం చేశారని, ప్రభుత్వ రంగ సంస్థలకు దేశంలోని బొగ్గు గనులను కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన గనుల సవరణ చట్టానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు.
బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించిందని మంత్రి భట్టి పేర్కొన్నారు. గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనకూడదని కేసీఆర్ ఆదేశించారని, కేసీఆర్ సన్నిహితులకు బొగ్గు గనులు వెళ్లేలా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తన సన్నిహితుల కోసం సింగరేణిని బొంద పెట్టారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం జరిగితే పాల్గొనకుండా, ఒడిశాలో జరిగిన వేలంలో పాల్గొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యక్తే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారని, సింగరేణిని కాపాడాలని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి ఆస్తులను, వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సింగరేణి బంద్ అయితే చాలా మందికి ఉద్యోగాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ సహకరించాలని కోరారు.
"బొగ్గు గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనేలా చట్టం చేశారు. ఈ చట్టానికి బీఆర్ఎస్ పార్టీ మద్ధతునిచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలకు సైతం బొగ్గు గనులను కేటాయించలేదు. గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనకూడదని కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ తన సన్నిహితులకు బొగ్గు గనులు వెళ్లేలా కుట్ర చేశారు". - భట్టి విక్రమార్క, మంత్రి
బర్త్ డే స్పెషల్ - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం భట్టి - Deputy CM Bhatti birthday