Loan App Harrasments : రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు తాళలేక ఓ యువకుడు కేవలం పెళ్లైన నెల రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.2 వేల కోసం భార్యాభర్తల ఫొటోలను మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లు వారి బంధువులకు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన డిసెంబరు 10వ తేదిన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
లోన్‌యాప్‌ల వల్ల జరిగిన కొన్ని అనర్థాలు..
- నంద్యాల జిల్లాలో శ్రీశైలం ప్రాంతానికి చెందిన ఓ యువతి రూ.15 వేల లోన్ తీర్చే క్రమంలో తీవ్ర వేధింపులకు గురైంది. డిసెంబరు 9న శ్రీశైలంలోని శిఖరేశ్వరం నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఫారెస్ట్ పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది.
- కనిగిరి మండలం శంఖవరానికి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు రుణ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. రికవరీ ఏజెంట్ల బారినపడి మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో రూ.1.60 లక్షలు చెల్లించారు. అయినప్పటికీ మరి కొంత చెల్లించాలని కేటుగాళ్లు డిమాండ్ చేశారు. ఆ యువకుడి ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడంతో ప్రాణాలు విడిచాడు.
ఇటీవల కాలంలో రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు బలవుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులలో ఎక్కువగా యువత, మహిళలు, విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. పూర్తిగా తిరిగి చెల్లించినా ఇంకా లోన్ చెల్లించాల్సింది ఉందంటూ, ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండడం సైబర్ నేరగాళ్ల బరితెగింపులకు పరాకాష్ఠగా నిలుస్తోంది. దీంతో బాధితులు మనస్తాపానికి గురై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇటువంటి జటిలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సైబర్ దాడి నుంచి కాపాడుకునేందుకు ఓ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన ఉంటే ఏ సందర్భంలోనైనా ఉపయోగపడుతుందని పోలీసులు చెబుతున్నారు.
పూర్తిగా సురక్షితం, నమ్మకమైనది : వెబ్‌సైట్ పేరు www.stopncii.org. అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్‌సైట్ పూర్తిగా సురక్షితమైనదని పోలీసులు చెబుతున్నారు. మనం అప్‌లోడ్ చేసిన ఫోటోలను డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ లాంటివి చేయడం ఉండదు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ తరహాలో మన ఫోటోకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. దాని ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో మన చిత్రాలు అప్‌లోడ్ అయితే టెక్నాలజీ ఆధారంగా గుర్తించి వెంటనే తొలగిస్తుంది. 2015లోనే అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్‌సైట్ ఇప్పటివరకు అంతర్జాతీయంగా రెండు లక్షల మందికి పైగా బాధితుల మార్ఫింగ్‌కు సంబంధించిన వాటిని తొలగించి వారికి వ్యక్తిగత రక్షణను కల్పించింది.
ఫిర్యాదు చేయవచ్చు : మీ ఫొటోలతో ఎవరైనా అశ్లీల చిత్రాలు తయారుచేసి ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తుంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీ చరవాణికి వచ్చిన చిత్రాలను ఈ సైట్‌కు పంపాలి. ఇందులో తొమ్మిది రకాల ప్రశ్నలకు సమాధానం ఇస్తే ఆ మేరకు వివరాలు నమోదవుతాయి. తర్వాత ఫొటోలు అప్‌లోడ్ చేస్తే వాటిపై ఈ వెబ్‌సైట్ నిఘా పెడుతుంది.
ఈ జాగ్రత్తలు మేలు : సోషల్ మీడియా విషయంలో యువత చాలా అప్రత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోలు అప్‌లోడ్ చేయకపోవడమే ఉత్తమమని ఒక వేళ చేసినా ఇతరులకు వాటి యాక్సెస్ లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రొఫైల్ చిత్రాలను ఇతరులకు డౌన్‌లోడ్ కాకుండా లాక్ వేయాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్టులు ఎట్టి పరిస్థితిల్లోనూ ఆమోదించరాదు.
అలాంటి రీల్స్ చూస్తున్నారా? - ఐతే బీ కేర్‌ఫుల్ - వాళ్లకు దొరికితే నిండా మునగడం ఖాయం!
లోన్ యాప్‌ల ఉచ్చులో పడకండి - జీవితాన్ని ఆగం చేసుకోకండి - Loan App Harassments in telangana