Cyber Crime Police on Fraudsters : నగరంలో ఏటేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా సైబర్ నేరగాళ్లు సుమారు 17 రాష్ట్రాల్లో మారుమూల పల్లెల్లో ఉండి దేశ వ్యాప్తంగా మోసాలకు తెగబడుతున్నారు. కాజేసిన నగదును బిట్‌కాయిన్స్‌గా(Bitcoins) మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. విదేశాల్లో దాగిన ప్రధాన సూత్రదారులు తమ ఆచూకీ తెలియకుండా దళారులతో ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. కమీషన్‌కు ఆశపడిన నిరుద్యోగులు, యువతీ, యువకులు ఆన్‌లైన్ మోసాలకు అవసరమైన నకిలీ కంపెనీల సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతాలు, టెలీకాలర్స్‌కు(Tellecallers) సమకూర్చుతున్నారు. చేతులు మారుతున్న ఈ వేలకోట్ల సొమ్ము చివరకు ఎక్కడకు చేరుతుందనేది అంచనా వేయలేకపోతున్నారు.
మోసపోయినట్టు గ్రహించి ఫిర్యాదు చేసేంత సమయంలోనే నగదు వేర్వేరు ఖాతాల ద్వారా విదేశాలకు చేరుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా బ్యాంకు లావాదేవీలను నిలువరించటం దర్యాప్తు బృందాలకు సవాల్‌గా మారుతోంది. సైబర్‌నేరాల్లో నష్టపోయిన బాధితుల సొమ్ము రికవరీ అసాధ్యంగా మారుతోంది. గతేడాది 133.59 కోట్లు రూపాయల సొమ్ము గల్లంతైతే 2శాతం కూడా తిరిగి ఇప్పించలేకపోవటమే ఇందుకు నిదర్శనం. గతేడాది 2 వేల 735 కేసుల్లో 169 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో పక్కా ఆధారాలతో ఇద్దరికి మాత్రమే జైలు శిక్షలు విధించగలిగారు.
Cyber Crime Police on Online Scam : ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సంఖ్య పెంచబోతున్నారు. కేసు నమోదవగానే నేరస్థులు కాజేసిన నగదును జమచేసిన బ్యాంకు ఖాతాలను గుర్తిస్తారు. వాటిని ఎన్ని ఖాతాల ద్వారా మళ్లిస్తున్నారనే వివరాలను త్వరితగతిని సేకరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో చివరకు నగదు ఎవరి వద్దకు చేరుతుందనేది పక్కా ఆధారాలు రాబడతారు. ఇప్పటి వరకూ తప్పించుకు తిరుగుతున్న కీలక సూత్రదారులను గుర్తించటం, వారి ఆర్ధిక లావాదేవీలను నిలువరించటమే దీని ముఖ్యోద్దేశమని నగర సీపీఎస్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
కరెన్సీని బిట్‌కాయిన్స్ రూపంలోకి మార్చక ముందే నగదు ఫ్రీజ్ చేయటం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చంటున్నారు. ప్రతి కేసులో నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిరావటం శ్రమ, ఒత్తిడితో కూడిన సమస్య. దిల్లీలో(Delhi) నాలుగైదు బృందాలు అందుబాటులో ఉండటం ద్వారా ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్లేలోపుగానే నిందితుల సమాచారం, అరెస్ట్‌లకు అవసరమైన పూర్తి అంశాలను పూర్తి అందిస్తారు. నిందితుల అరెస్ట్, జైలుశిక్షలు పెంచటం ద్వారా సైబర్‌నేరాలను కట్టడి చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్
సైబర్ క్రైమ్స్‌లో మొదటి స్థానంలో తెలంగాణ - ఆర్థిక నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ మనమే