Crocodile in Medak District : మొసళ్లను మనం సహజంగా జూపార్కులు, సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ వరదలు సంభవించిన సమయాల్లోనూ బయటపడుతుంటాయి. అలాంటి మొసలి ప్రధాన రహదారిపై కనిపిస్తే ఎవ్వరైనా జంకాల్సిందే. మెదక్ జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనే ప్రయాణికులకు ఎదురైంది.
మెదక్ పట్టణంలోని పసుపులేరు వాగు సమీపంలో మెదక్ -హైదారాబాద్ ప్రధాన రహదారిపై అర్థరాత్రి మొసలి ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. అక్కడున్న ప్రయాణికులు ఆ మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఆ రోడ్డు మార్గం గుండా వెళుతున్న ప్రయాణికులు మొసలిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియో కాస్త సోషల్ పోస్ట్ చేయగా మీడియాలో వైరల్ అయ్యింది.
వరదలో కొట్టుకొచ్చినట్లు అనుమానం : మొన్నటి వర్షా కాలంలో కురిసిన భారీ వర్షాలకు పసుపులేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాగులోనే మొసలి నివాసం ఏర్పాటు చేసుకుని సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. పసుపులేరు వాగులో ప్రస్తుతం నీరు తక్కువగా ఉండటంతో మొసలి రోడ్డుపైన కనిపించింది. మొసలిని జాగ్రత్తగా పట్టుకొని వెంటనే సంరక్షణ కేంద్రానికి తరలించాలని పట్టణవాసులు అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మొసళ్ల నుంచి ప్రజలకు ఎప్పుడైనా ప్రమాదమేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కురిసిన వర్షాలకు నది పరివాహక వ్యవసాయ పొలాల్లోకి అప్పుడప్పుడు మొసళ్లు వస్తున్నాయి. ఇలాంటి పరిసర ప్రాంతంలో మొసళ్ల సంచారంపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో కురిసిన వర్షాలకు చెరువులు, జలాశయాలు జలకళ నిండిపోయాయి. అలా ప్రవాహంలో కొట్టుకువచ్చిన మొసళ్లు కొన్నిసార్లు బయటకు వస్తున్నాయి. ఇదే మాదిరిగా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. కొన్నిసార్లు పంట పొలాల్లోకి, హైదరాబాద్ పాతబస్తీలో మీరాలం చెరువు వద్ద మొసళ్లు వచ్చిన కనిపించిన సందర్భాలున్నాయి.
అర్ధరాత్రి ఇంటి ముందు మొసలి ప్రత్యక్షం - ఉలిక్కిపడ్డ కుటుంబం - Huge Crocodile Enters in House