Cooking Oils At Low Price On Ration Card In AP : వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు పామోలిన్ ఆయిల్ లీటరు (850 గ్రాముల ప్యాకెట్) రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లుగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఒక్కో రేషన్ కార్డుపై ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు ఇస్తారంటే : ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. గురువారం విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల డిస్ట్రిబ్యూటర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ధరల నియంత్రణ అంశంపై చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ దేశాల నుంచి వంటనూనె దిగుమతులు తగ్గడంతో పాటు ట్యాక్స్‌లు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ఆయిల్ ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్రమంతటా ఒకే ధరపై విక్రయించాలని మంత్రి మనోహర్ వారికి సూచనలు చేశారు.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు : గత కొన్ని రోజులుగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య వేతన జీవులు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే అరకొర వేతనంలో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు పిల్లల ఫీజులు, ఆరోగ్యంపై ఖర్చు చేస్తూ మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్నాడు. ఉప్పు నుంచి పప్పుల వరకు బియ్యం నుంచి వంటనూనెల వరకు ఇలా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఇక కూరగాయల ధరల మాట చెప్పాల్సిన అవసరమే లేదు. టమాట కొండెక్కి కూర్చుంది. పండుగ వేళ మార్కెట్లో ధరాఘూతంతో సతమతమవుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అసలే అంతంత మాత్రం ఆదాయంతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగిన ధరలు ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన మారింది.
బియ్యం కుతకుత, నూనెలు సలసల - పండుగ వేళ నిత్యావసరాల మంట - Essential Commodities Prices Hikes