CAG Report on Govt Expenses on Health Sector : ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం నిర్దేశించిన మొత్తంలో సగం కూడా ఉండటం లేదని కాగ్ పేర్కొంది. జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం మొత్తం బడ్జెట్లో వైద్య రంగానికి 8% కేటాయింపులు ఉండాలని నిర్దేశించిన రాష్ట్రంలో అది కేవలం సగం కూడా ఉండటం లేదని పేర్కొంది. 2025 నాటికి ఆరోగ్య రంగంపై వ్యయం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 1.15 % ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో అది 1 శాతం కంటే తక్కువే అని పేర్కొంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు తగినన్ని పడకలు సైతం అందుబాటులో లేవని కాగ్ చురకలు అంటించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం 35,001 పడకలు అవసరం ఉండగా ప్రభుత్వంలో కేవలం 27 వేల పడకలే ఉన్నాయని కాగ్ తేల్చి చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన మేర వైద్య సేవలు మెరుగుపడలేదన్న కాగ్, రాష్ట్రంలోని 122 పల్లె దవాఖానాల్లో అసలు వైద్యులే లేరని, మరి కొన్ని చోట్ల వైద్యులు ఉన్నా ఓపీ సేవలు అందటం లేదని గుర్తించామని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపరిచేందుకు మరింత కృషి చేయాలని సూచించింది. రాష్ట్రంలో సీ సెక్షన్లు తగ్గాయని అంటునప్పటికీ సీ సెక్షన్ల రేట్ జాతీయ సాగటు కంటే అధికంగా ఉందని కాగ్ నిగ్గు తేల్చింది.
మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీ సెక్షన్లు 60% నుంచి 10% తగ్గినప్పటికీ ప్రైవేట్లో 40%కి పెరిగాయని కాగ్ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో సీ సెక్షన్ల రేట్ జాతీయ సగటు కంటే ఎక్కువ అని పేర్కొంది. ఇక ప్రజలు ఆరోగ్యం కోసం సొంత డబ్బును రాష్ట్రంలో ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారని కాగ్ తేల్చింది. ఉన్నత వైద్యానికి కేంద్రాలుగా ఉన్న మెడికల్ కాలేజీలను సిబ్బంది కొరత పీడిస్తోందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీల్లో తగినంత సిబ్బంది లేదని నివేదికలో పేర్కొంది.
మరోవైపు మందుల కొనుగోళ్లలోనూ లోపాలను కాగ్ ఎత్తిచూపింది. నిర్దేశించిన ధర కంటే అధిక ధరకు మందులు కొనుగోళ్లు చేయడంతో పాటు గడువు ముగిసిన ఔషధాలను సకాలంలో భర్తీ చేయించకపోవడం వల్ల రాష్ట్రానికి రూ. 300 కోట్లకు పైగా నష్టం వచ్చిందని ఎత్తిచూపింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం రాష్ట్రం సరిగా వినియోగించుకోలేదని కాగ్ తేల్చింది. పేషెంట్ ప్రొవైడర్ సపోర్ట్ కార్యక్రమానికి కేంద్రం రూ. 175 కోట్లు కేటాయించగా వాటిని మార్చి వరకు వినియోగించుకోలేదంది. వికారాబాద్ సహా నాలుగు జిల్లాల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన సుమారు రూ. 8 కోట్ల నిధులు సైతం ఉపయోగించుకోలేదని పేర్కొంది.