Congress Focus On Parliament Election : కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రాష్ట్రం నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు అందించటమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు గానూ గత ఎన్నికల్లో 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్(Congress) గెలుపొందింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటంతో ఈసారి కనీసం 14 చోట్లనైనా విజయం సాధించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పలుమార్లు ఇదే లక్ష్యాన్ని పార్టీ నేతలకు నిర్దేశిస్తున్నారు.
ఖమ్మం లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్లో పోటాపోటీ - టికెట్ ఆశిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబీకులు
Congress Parliament Election Strategies : ఇది అంత సులువు కాకపోయినా, వ్యూహాత్మకంగా ముందుకెళ్తే అసాధ్యం కాదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, గెలుపు గుర్రాలే ప్రామాణికంగా పార్టీ నేతలు సాగుతున్నారు. పార్టీలో బలమైన నేతలు లేనిచోట బయట పార్టీల నుంచి వచ్చే వారిని ఆహ్వానించాలని నిర్ణయించారు. శాసనసభ ఎన్నికలకు ఎంపిక చేసినట్టుగానే, లోక్‌సభ సమరానికీ గెలుపు గుర్రాలను కాంగ్రెస్ నాయకత్వం సిద్ధం చేస్తోంది. ఎంపీ టికెట్ కోసం రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల నుంచి ఆశావహులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.
కేసీఆర్ సర్కార్ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
Congress Parliament Election 2024 : మొత్తం 309 మంది అర్జీ పెట్టుకోగా, రెండ్రోజుల క్రితం జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సభ్యుల ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసి, పార్టీకి నివేదిక అందించారు. ఈ జాబితాకు సంబంధించిన హార్డ్ కాపీలను సీజ్ చేసుకుని స్క్రీనింగ్ కమిటీ స్వాధీనం చేసుకుంది. పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి ఆధ్వర్యంలో అభ్యర్థుల వడపోత కార్యక్రమం కొనసాగుతోంది. మహబూబ్నగర్ నుంచి ఏఐసీసీ(AICC) కార్యదర్శి వంశీచంద్ రెడ్డికి టికెట్ ఇప్పటికే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
అలాగే ఏఐసీసీ హామీ మేరకు జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్‌ను కచ్చితంగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దించుతారని తెలుస్తోంది. వీటిని పక్కన పెడితే, మిగతా స్థానాల విషయంలోనే స్క్రీనింగ్ కమిటీ కసరత్తులు చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక పట్ల పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించటం, గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న వారిలో పలువురు ఇప్పటికే దిల్లీకి చేరుకుని లాబీయింగ్ సైతం మొదలు పెట్టారు. ఈ నెలలోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది.
కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరంలో ఒక బ్యారేజీ కూలిపోయింది, మరొకటి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది: ఉత్తమ్