Congress Party Focus On Nominated Posts : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు పార్టీ పదవుల భర్తీపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతుండడంతో పార్టీ కోసం పని చేసిన వారితో భర్తీ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
మొదటి విడతలో 37 మందికి వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం మరికొంత మందికి రెండో విడత కింద కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. సామాజిక సమతుల్యత పాటించి ఈ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. డిమాండ్ అధికంగా ఉండడంతో పార్టీ నాయకత్వం ఆచితూచి ముందుకు పోతోంది.
పార్టీకోసం పనిచేసిన వారికే పదవులు : పార్టీ బలోపేతానికి పని చేసిన వారికే పదవులు దక్కాలన్న యోచనలో కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా కొన్ని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసీ సుందరీకరణ కార్పొరేషన్ తదితర ముఖ్యమైన పదవులు ఎమ్మెల్యేలకు ఇస్తారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా వాటికంటే ముందు కమిషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్న పార్టీ నాయకత్వం వాటి కసరత్తులో కూడా వేగం పెంచినట్లు తెలుస్తోంది. విద్యా కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, రైతు కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్‌గా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ల ఎంపిక పూర్తి చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సామాజిక వర్గాల సమతుల్యత పాటించే విధంగా : బీసీ కమిషన్‌ను అధిక జనాభా కలిగిన బీసీ వర్గాలతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా ఇందులో మున్నూరు కాపు, యాదవ, గౌడ్, ముదిరాజులు లాంటి అత్యధిక జనాభా కలిగిన వారు ఛైర్మన్, సభ్యులు ఉండేట్లు చూడాలని యోచిస్తోంది. అదేవిధంగా విద్యా కమిషన్ ఛైర్మన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ మురళిని నియమిస్తుండడంతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశలో పని చేయగలిగే వారిని సభ్యులుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం యువతకు భాగస్వామ్యం కల్పించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అదే విధంగా విద్యపై పట్టున్న వారినే సభ్యులుగా నియమించడం ద్వారా సమర్ధవంతంగా పని చేసినట్లయితే రాష్ట్రంలో విద్యావ్యవస్థ మరింత మెరుగైన మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు. ఉపాధి కల్పించేట్లు చదువు ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం స్కిల్స్ లేని యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తున్నారు. రాబోయే కాలంలో ఆలాంటి పరిస్థితి లేకుండా ఉండేట్లు విద్యావ్యవస్థలో మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Telangana Nominated Posts : రైతు కమిషన్ ఛైర్మన్‌గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోదండ రెడ్డి ఉండడంతో సభ్యులు అంతా కూడా వివిధ సామాజిక వర్గాలకు చెంది, వ్యవసాయంపై పట్టున్న వారిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రైతును లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా పంటల సాగులో మార్పులు తీసుకొచ్చేందుకు ఈ కమిషన్ పని చేయాల్సి ఉండడంతో అదే స్థాయిలో అవగాహన కలిగిన వారినే సభ్యులుగా నియమిస్తారని పార్టీ వర్గాలు స్పస్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు సమావేశమై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే : పీసీసీ నూతన అధ్యక్ష ఎంపిక తరువాత కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ ఉంటే బాగుంటుందని సీనియర్ నాయకులు అభిప్రాయం. అయితే కొందరి పేర్లతో కూడిన జాబితాను పార్టీ నాయకులు సిద్దం చేశారని తెలుస్తోంది. ఆ జాబితాపై సీఎంతో చర్చించిన తరువాతనే పూర్తి వివరాలు బహిర్గతం అవతాయని స్పష్టం చేస్తున్నారు. దాదాపు 15 వీసీ పదవుల భర్తీ విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సమాచార కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వేయాల్సి ఉండడంతో అందుకు అర్హులైన వారి కోసం పార్టీ అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల లొల్లి - పునఃపరిశీలన యోచనలో పీసీసీ - Congress Nominated Posts Issue