Congress Fact Finding Committee Inquiry into Lok Sabha Election Result : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ(కురియన్ కమిటీ) మొదటి రోజు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ మినహా అందరూ హాజరయ్యారు. ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలను కురియన్ కమిటీ సేకరించింది. వారు చెప్పిన వివరాలను కమిటీ సభ్యులు నోట్ చేసుకున్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికలో తెలంగాణలో బీజేపీకి ఎందుకు సీట్లు పెరిగాయనే అంశాలపై కురియన్ కమిటీ ఫోకస్ పెట్టింది. 12 సీట్లు గెలవాల్సిన ఉండే ఎనిమిది మాత్రమే ఎందుకు గెలిచినట్లు ప్రశ్నించింది. మహబూబ్‌నగర్, మెదక్‌లో ఏం జరిగిందని కురియన్ కమిటీ ఆరా తీసింది. రేపు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనుంది. ఇందులో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కానుంది. అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఏఐసీసీ నేత కురియన్ తెలిపారు.
ఉదయం 11 గంటలకే సమావేశం ప్రారంభం : ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్‌లో మకాం వేసిన కురియన్ కమిటీ సభ్యులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 17 మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. నేడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో భేటీ మొదలైంది. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
మొదటగా ఓటమిపాలైన పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన అభ్యర్థులతో మొదలైన భేటీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, నీలం మధు, వి.రాజేందర్రావు, జీవన్ రెడ్డి, ఆత్రం సుగుణలు హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సాయంత్రం సురేశ్ షెట్కార్, మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు హాజరయ్యారు.
పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు : తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు 2024లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో పడిన బీఆర్ఎస్కు ఈ ఫలితాలు ఇంకా చేదు అనుభవాలను తెచ్చిపెట్టాయి. అయితే లోక్‌సభ ఎన్నికలో 12 సీట్లు తగ్గమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు సాధించింది. అలాగే బీజేపీ కూడా తన సంఖ్యను పెంచుకుంటూ అదే స్థాయిలో 8సీట్లను గెలుచుకుంది. ఎంఐఎం పార్టీ తన ఒక్క సీటును పదిలం చేసుకుంది.