CM Revanth Meeting With Collectors and SPs : రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 18న లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. పాస్‌బుక్ ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని స్పష్టం చేశారు. పంద్రాగస్టులో లోగా ధరణి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ సహా పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. రుణమాఫీ అమలుపై సీఎం పూర్తి స్పష్టత నిచ్చారు.
రైతురుణ మాఫీ: ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రైతురుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఆరోజు సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారుల సంబురాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పాస్‌బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ధరణి సమస్యలు: ధరణి సమస్యలపై పెండింగు దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధరణి సమస్యలపై దరఖాస్తులను తిరస్కరిస్తే వాటి కారణాలను కూడా వారికి తెలపాలన్నారు. ధరణిలో పలు సాంకేతిక సమస్యల పరిష్కారానికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చే అంశం పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు.
సరైన వైద్య సదుపాయం అందేలా: రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి డిజిటల్ హైల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. తమకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆర్ఎంపీలు, పీఎంపీల డిమాండ్లపై అధ్యయనం చేసి ఉత్తర్వులు ఇచ్చే అంశం పరిశీలించాలన్నారు.
రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్ - TG Digital Health Profile Card
ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు: రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలన్నారు. అటవీ భూములపై డ్రోన్ సర్వే చేసి.. ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత గిరిజనులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలని సూచించారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. పోడు భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మహిళా సంఘాలకు అద్దె బస్సులు: స్వయం సహాయక సంఘాల్లో మహిళల సంఖ్య కోటికి చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం సూచించారు. ఐదేళ్లలో లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. మహిళా సంఘాల వ్యాపారాలకు కలెక్టర్లు తమ వినూత్న ఆలోచనలు జోడించాలని ఆదేశించారు. ఆర్టీసీలో అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చేలా పరిశీలించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఆరుగ్యారంటీల అమలు: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని జనంలో విశ్వాసం కల్పించాలని తెలిపారు. ఆరుగ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. జిల్లా స్థాయిలో అధికారుల నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం కలిగేలా, మానవీయ కోణంలో ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతీ పేద తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, విద్యార్థిపై నెలకు 85వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను పర్యవేక్షణపై కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్: నకిలీ విత్తనాల తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో శాంతి కమిటీలను పునరుద్ధరించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో ఉండాలి కానీ నేరస్తులతో కాదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో రాత్రిపూట ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలన్నారు. సమర్థత ఆధారంగానే పోస్టింగ్‌లు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
'సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాలు - మత్స్యకార పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారు'