CM Revanth At Police Passing Out Parade : కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. గండిపేట జలాలు నగర ప్రజల తాగునీటికి వాడుతున్నామని చెప్పారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయని, వరదలు వస్తే పేదల ఇళ్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని, ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోండని సూచించారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.
CM Revanth On Hydra Demolitions : కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతోందని, ఆ కాలుష్యాన్ని నియంత్రించాలని తెలిపారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని, మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11 వేల మంది బాధితులకు 2 పడక గదుల ఇళ్లు ఇస్తామని ప్రకటించారు.
తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ సబ్ ఇన్‌స్పెక్టర్ల మూడో బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అకాడమీలో శిక్షణలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సీఎం మెడల్స్ అందించారు. పోలీస్ స్కూల్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని, రాబోయే రెండేళ్లలో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసు సిబ్బంది పిల్లలు ఒకేచోట చదువుకోవాలని సూచించారు. అంతకముందు పోలీస్ విభాగం తరఫున 11 కోట్ల 6 లక్షల 83 వేల 571 రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు రేవంత్‌రెడ్డికి చెక్‌ను అందజేశారు.
కులవృత్తులతో పాటు చేతి వృత్తులను బలోపేతం : గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణలో డిసెంబర్ 3న ప్రజాపాలన ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వచ్చాక 30 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించామని, మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు. కొత్తగా గ్రూప్-1, 2, 3, డీఎస్సీ, పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని వ్యాఖ్యానించారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉందని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా ఇస్తోందని చెప్పారు.
అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే ఇబ్బందవుతుందని వాయిదా వేయాలని కోరారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకున్నాం. సైబర్, గంజాయి నేరాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో వ్యసనాలకు తావు లేదు. కులవృత్తులతో పాటు చేతి వృత్తులను బలోపేతం చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించాం. రైతులు ఆత్మగౌరవంతో తల ఎత్తుకునేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేశాం- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
547 సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ : పాసింగ్ అవుట్ పరేడ్‌కు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మొత్తం 547 సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్సైలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 శిక్షణ ఉద్యోగుల్లో 401 మంది సివిల్ ఎస్సైలు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 547 మందిలో 472 మంది గ్రాడ్యుయేట్స్, 75 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది బీటెక్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. పాసింగ్ అవుట్ పరేడ్ కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ భాగ్యశ్రీ పాల్గొన్నారు.