Telangana Govt to Upgrade ITIs Into Advanced Technology Centers : సాంకేతిక నైపుణ్యం ఉంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ వెల్లడించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు(ఏటీసీ)గా అప్‌గ్రేడ్ చేయాలని కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోందని అన్నారు. కానీ మన విద్యా విధానం మాత్రం 40 ఏళ్ల క్రితం పరిస్థితులకు చెందినదిగా ఉందని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దటం కోసమే ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికీ లక్షల మంది యువత టీజీపీఎస్సీ, మెడికల్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైపు చూస్తున్నారని వివరించారు.
'కానీ సాంకేతిక నైపుణ్యం ఉంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికేట్ ఉంటే ప్రయోజనం లేదు. సర్టిఫికేట్‌తో పాటు నైపుణ్యం ఉంటేనే ఎక్కడైనా రాణించగలం. రోబోలు మొదలుకుని అత్యాధునిక యంత్రాలు తీసుకువచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నాం. మన దేశ ప్రధాన సంపద యువ జనాభా. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు మనవాళ్లే. ముఖ్యంగా మధ్య తరగతి యవతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని' సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఐటీఐల ఆధునీకరణకు ప్రభుత్వం పచ్చజెండా : ఇటీవల ఐటీఐలను ఆధునికీకరణ కోసం రూ.2,324.21 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇలా రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటీసీలుగా మార్చేందుకు రెండు నెలల క్రితమే టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఏటీసీల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల నియామకం చేశారు. ఈ కేంద్రాల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల కోర్టుస్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏటా రూ.307.96 కోట్లు, టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లుగా ఉంది. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగాలు కల్పించనుంది.
ఉపాధికి రాచబాట- విద్యార్థులకు వరంగా మారిన ఐటీఐ కోర్సులు - employment through ITI course