CM Revanth Instructions to Arogyashri Officials : రాష్ట్రంలో పరిపాలనా అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు జరుపుతూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు. ఆస్పత్రుల్లోని ప్రతీ బెడ్‌కు ఒక నంబరు కేటాయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. తమకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆర్ఎంపీలు, పీఎంపీల డిమాండ్‌పై అధ్యయనం చేసి ఉత్తర్వులు ఇచ్చే అంశం పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
CM Revanth Review Meeting With Collectors at Secretariat : ఇవాళ సచివాలయంలో వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పథకాల అమలు, సవాళ్లపై ఆయన వారితో చర్చించారు. ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం అనే సందేశం ప్రజల్లోకి వెళ్లేవిధంగా సివిల్ సర్వెంట్ అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. సంక్షేమ పథకాలు కిందిస్థాయికి తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలన్నారు. సమావేశంలో ఆరోగ్య శ్రీ పథకం బీమాను 10లక్షలకు పెంచిన అంశం కూడా చర్చకు వచ్చింది. అధికారుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేషన్ కార్డ్ లేకున్నా ఆరోగ్య శ్రీని ఆపొద్దని సూచించారు. రాష్ట్రంలో చాలామంది పేదలకు రేషన్ కార్డు లేనందున వారికి అన్యాయం జరగకూడదన్నారు. ప్రజలందరికి నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ వివరాలతో రోగికి వైద్యం అందించడం సులభం అవుతుంది.
Harish Rao Welcomes to Arogyashri orders : రేషన్‌కార్డుకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టవద్దన్న సీఎం ఆదేశాలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అదేవిధంగా రైతు రుణమాఫీకి సైతం రేషన్‌కార్డు నిబంధన ఎత్తివేయాలని కోరారు. రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేయాలని, పాస్‌బుక్‌నే రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.