Doddi Komaraiah Kuruma Bhavan Inaugurate : కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీలు పేదలకే అందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమ్మలా ఉండే తెలంగాణ తల్లినే తెచ్చుకున్నామని అన్నారు.. ఆ విగ్రహం మన అమ్మకు, అక్కకు ప్రతిరూపమని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా కులగణన చేపడుతున్నామని వివరించారు. 98 శాతం కులగణన జరిగిందని వెల్లడించారు. హైదరాబాద్లోని కోకాపేట్లో కురుమ భవన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కురుమల నిజాయితీని, గొప్పతనాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. కురుమలు అత్యంత నమ్మకస్తులని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని, ఊళ్లో భూమి అమ్ముకోవాలంటే ముందు కురుమలకు అమ్ముకోవాలని చెబుతుంటానని తెలిపారు. పార్లమెంటులో కూడ కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచుతామని చెప్పారు.
"కురుమలు అత్యంత నమ్మకస్తులని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ఊళ్లో భూమి అమ్ముకోవాలంటే ముందు కురుమలకు అమ్ముకోవాలని చెబుతుంటాను. కురుములకు భూమి అమ్మితే డబ్బు నడుముకు కట్టుకుని తెచ్చి ఇస్తారు.. వారు ఇచ్చిన డబ్బును లెక్కపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దొడ్డి కొమురయ్య ఆనాడు రైతాంగ పోరాటంలో తెగువ చూపారు. దొడ్డి కొమురయ్య రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపారు. కురుమలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనేది ప్రభుత్వ కోరిక. ఈ కురుమ భవనం విద్యకు వేదిక కావాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గెలవకపోతే టికెట్లు ఎందుకు ఇచ్చారంటారు : కురుమలకు, యాదవులకు రెండేసి చొప్పున ఎంపీ సీట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కురుమలను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. గెలవకపోతే టికెట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నలు వస్తాయని చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కురుమ వర్గానికి చెందిన వ్యక్తినేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"మృదు స్వభావులు, సున్నిత మనస్కులు ఎవరినైనా మనం ఎందుకు ఇబ్బంది పెట్టేలా మన కష్టాన్ని మనం నమ్మకుందాం. మన చెమటను నమ్ముకుందాం. అవసరమైతే ఒక గంట ఎక్కువ పని చేయాలి అంతేగానీ ఎవరికీ నష్టం కలిగించవద్దని కోరుకునే సోదరులు కురుమ సోదరులు. అలాంటి కురుమలు నుంచి వచ్చిన దొడ్డు కొమురయ్య గొప్ప పోరాట యోధుడు. ఆనాడు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటంలో ముందుండి నడిపించారు. కురుమలు తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. ఇది ప్రభుత్వ కోరిక. ఈ కురుమ భవనం విద్యకు వేదిక కావాలి." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
'చిత్తశుద్ధితో గురుకులాల ప్రక్షాళన - ప్రతి నెల 10లోపు విద్యా సంస్థలకు నిధులు'
మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు? - కానీ ఆ స్కిల్ ఉన్నవారికే అవకాశం