CM Revanth Reddy Slams On KCR : గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసి, నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో 'కొలువుల పండుగ' కార్యక్రమంలో భాగంగా 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. దసరాలోపు ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ఎల్బీస్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నామన్నారు.
ఈ క్రమంలోనే వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే, పదేళ్ల దుర్మార్గం ఒకవైపు ఉందని వ్యాఖ్యానించారు. విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందరం నిలబెట్టుకుందామన్న ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వల్ల కేసీఆర్ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు ఆయన పొందిన గౌరవం తెలంగాణ ఉద్యమం ఘనతే తప్ప, ఆయన గొప్పతనం కాదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినట్లుగా, ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు, ఒక ఉద్వేగం అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"తెలంగాణ ఉద్యమ కీలక నినాదం ప్రభుత్వ ఉద్యోగాలు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్ల కొద్దీ సాగదీసింది. నోటిఫికేషన్ల దశలోనే చాలా జాప్యం చేసింది. పరీక్ష పూర్తయినా ఐదారేళ్లు నియామక పత్రాలు ఇవ్వలేదు. కేసీఆర్ ఉద్యోగం పోయింది, పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి. మేం వచ్చిన 90 రోజుల్లో 31 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాం. ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు, ఒక ఉద్వేగం" - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
మూసీ పరీవాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా? : పదేళ్ల నిర్మాణాలపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. డీపీఆర్ లేకుండానే రూ.లక్షన్నర కోట్లు పోసి కట్టిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిపోయిందని ఆక్షేపించారు. మలన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నాణ్యతపైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు. మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందని, ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసీ ప్రక్షాళన చేసి తీరతామని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి, పిల్లలకు నది పేరు పెట్టేలా అద్భుతంగా పునర్ నిర్మిస్తామని తెలిపారు.
రుణమాఫీ కానివారు ఆ పని చేయాలన్న సీఎం రేవంత్ - అదేంటో మీకు తెలుసా? - Cm Revanth on Runa Mafi