Police Denied Pushpa 2 Actors to Watch Benefit Show : పుష్ప-2 చిత్ర ప్రీమియర్ షో వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. పుష్ప-2 నటీనటులు సహా యూనిట్ వస్తున్నట్లు పోలీసులకు తెలిపిన సంధ్య థియేటర్ యాజమాన్యం, పోలీసుల లిఖిత పూర్వకంగా అనుమతి కోరింది. ఈ నేపథ్యంలో థియేటర్‌కు ఇరువైపులా రెస్టారెంట్లు ఉన్నాయని, దీనివల్ల రద్దీ ఎక్కువగా ఉంటుందని, సంధ్య థియేటర్ వద్ద లోనికి, బయటికి వెళ్లే మార్గంలో సినీ నటులు వచ్చి వెళ్లే అవకాశం లేదని, రద్దీని నియంత్రించలేమంటూ.. సంధ్య థియేటర్ వారిచ్చిన లేఖ వెనుకనే అనుమతి నిరాకరిస్తూ చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాసి ఇచ్చారు.
ఈ మేరకు నటులెవరూ ప్రీమియర్ షో కోసం థియేటర్ వద్దకు రావద్దని సంధ్య థియటర్ యాజమాన్యానికి పోలీసులు సూచించారు. అయినప్పటికీ పోలీసుల మాట వినకుండా నటుడు అల్లు అర్జున్‌తో పాటు మరికొంత మంది చిత్రబృందం స్పెషల్ షోకు వచ్చారు. ఈ నెల 4న జరిగిన ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి రాగా, తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అరెస్టు -రిమాండ్ - బెయిల్ : ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ పోలీసులు సినీ నటుడు అల్లుఅర్జున్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఈ నెల 13న నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. వాంగ్మూలం, వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన చిక్కడపల్లి పోలీసులు, వెంటనే నాంపల్లి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ క్రమంలో అదే రోజు అత్యవసరంగా విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరెస్టు, రిమాండ్, బెయిల్ ఇలా వరుసగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బెయిల్‌కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు ఈ నెల 13న రాత్రి 10 గంటల తర్వాత చేరటంతో చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. తిరిగి ఈ నెల 14న ఉదయం విడుదల అయ్యారు. అనంతరం దీనిపై స్పందించిన అల్లు అర్జున్, మరోసారి బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా : అల్లు అర్జున్
'కేసు విషయంలో ఎన్నో మాట్లాడాలని ఉన్నా - కోర్టు ఆదేశాల మేరకు మాట్లాడలేకపోతున్నా'