Union Minister Kishan Reddy on Coal Mine Auction : బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కోల్ మైన్స్ వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఎటువంటి నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ గనుల వేలంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై ప్రధానితో మాట్లాడతానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉందన్న కిషన్‌రెడ్డి, సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు.
"రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన అన్ని విషయాలపైనా పరిశీలిస్తాం. ఒక రెండు మైనింగ్‌లు మా దృష్టిలో ఉన్నాయి. ఒడిశాలో ఉన్న నైని ప్రాజెక్ట్ అంశం 2015 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉంది. దానిక సంబంధించి ఒక్క అడుగూ ముందుకు కదల్లేదు. ఇకపై ఆ సమస్య ఉండదు. ప్రెజెంట్ ఆ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది. దీంతో మరింత నేను చొరవ తీసుకొని ముందుకు సాగుతాం. అలానే మరికొన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తాం."- కిషన్‌రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
సింగరేణి విషయంలో రాజకీయాలు చేయడం తగదు : ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. దిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉందన్న ఆయన, ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్,. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదని ఆక్షేపించారు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరారు. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదని కిషన్‌రెడ్డి వివరించారు.