Central Minister Bandi Sanjay Fires On Congress : రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే, వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింపజేస్తుండటం అన్యాయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లెక్కన నూటికి 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
10 వంతు మాత్రమే రుణ మాఫీ : రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకు పైమాటేనన్నారు. అందులో 10వ వంతు మాత్రమే చెల్లించి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సంబురాలు చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడటం సిగ్గు చేటు అన్నారు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? రబీ, ఖరీఫ్‌లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కారణాలు చెప్పాలని డిమాండ్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా తప్ప రైతుల పట్ల ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తుశుద్ధి లేదని ఆరోపించారు. రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ చేయాలని కోరారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు 39 లక్షలు అన్న ఆయన, మిగిలిన వారికి రుణమాఫీ చేయకపోవడానికి కారణాలేమిటో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
అబద్దాలతో కాంగ్రెస్ పాలన : అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అలానే పాలన సాగిస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు, ప్రజలకు బాకీ పడ్డ సర్కార్ అని విమర్శించారు. రూ.6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా అని ప్రశ్నించారు. రూ.లక్ష రుణమాఫీ చేశామని చెబుతూ రూ.2 లక్షలు మాఫీ చేసినట్లు ప్రకటనలా అని వ్యాఖ్యానించారు. రూ.2 లక్షల రుణమాఫీపై రైతాంగాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు మభ్యపెడుతుందంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత యాసంగి రైతుబంధులోనే రూ.2 వేల కోట్లు ఎగ్గొట్టారన్నా ఆయన, రైతు భరోసా ప్రకారం చూస్తే రూ.6 వేల కోట్లు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. తాజాగా రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ.6 వేల కోట్లు ఇచ్చి .10 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోంది : నిరంజన్ రెడ్డి