Celebrities Reaction over Allu Arjun Arrest : అల్లుఅర్జున్ అరెస్టుపై యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అరెస్టును ఖండిస్తూ పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు నాని తెలిపారు. మంచి సమాజంలో జీవించాలన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆ ఘటన నుంచి పరిశ్రమ ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని నిందించడం సరైనది కాదని నాని అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా ఇదే అంశంపై ఓ సినీ వేడుకలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరని, జాగ్రత్తగా ఉండాలని మాత్రమే వాళ్ల చుట్టుపక్కల వారికి సూచిస్తుంటారని వరుణ్ ధావన్ తెలిపారు. ఈ విషయంలో ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయమన్నారు. పుష్ప-2 కథానాయిక రష్మిక కూడా బన్నీ అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాను నమ్మలేకపోతున్నానని, సంధ్య థియేటర్ వద్ద దురదృష్టకరమని, ఆ ఘటన తన హృదయాన్ని కలచివేస్తుందని పేర్కొంది. అదే సమయంలో ఒకే వ్యక్తిని నిందించడం సబబు కాదని అల్లు అర్జున్‌కు రష్మిక తన మద్దతు ప్రకటించింది.
ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలి : థియేటర్ల వద్ద తొక్కిసలాట ఘటన బాధాకరమన్న నటుడు నితిన్ ఈ ఘటనను తప్పుపట్టడం కంటే దాన్ని నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. మరో కథానాయకుడు సందీప్ కిషన్ కూడా బన్నీ అరెస్టును తప్పుపట్టారు. ఊహించని ఘటనలో ఒకే వ్యక్తి ఎలా బాధ్యత వహించగలరని ప్రశ్నించారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మెరుగైన భద్రత అవసరాలను గుర్తు చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూసుకుందామని పిలుపునిచ్చిన అనిల్, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు. అలాంటి వ్యక్తిని ఒక్కరినే బాధ్యత వహించమనడం సరైన నిర్ణయం కాదని అనిల్ అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకులన్ని అరెస్టు చేస్తారా ? : మరో దర్శకుడు అజయ్ భూపతి అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ అల్లు అర్జున్ అరెస్టుపై ప్రభుత్వాలకు నాలుగు ప్రశ్నలు సంధించారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లు అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎన్నిక ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులన్ని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించిన వర్మ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ఎవరైనా పోతే హీరో హీరోయిన్లను అరెస్టు చేస్తారా అంటూ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే భద్రత ఏర్పాట్లు పోలీసులు, నిర్వహకులు తప్ప హీరోలు, ప్రజా నాయకులు ఎలా నియంత్రించగలరని ఆర్జీవీ ప్రశ్నించారు.
అల్లు అర్జున్ నివాసానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు : అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతోపాటు మెగా బ్రదర్ నాగబాబు, రానా, దర్శకులు సుకుమార్, రాఘవేందర్‌రావు వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు నిర్మాత దిల్‌రాజు వచ్చి స్టేషన్‌లో ఉన్న బన్నీని కలిసి ధైర్యం చెప్పారు.
నాంపల్లి కోర్టుకు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు నాగవంశీ, బన్నీ వాసు, ఎస్కేఎన్ సహా ఆయన సన్నిహితులు హాజరై కోర్టులో జరుగుతున్న పరిణామాలను గమనించారు. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.