Cat Drinking Curd in Kukatpally JNTU Canteen : కొద్దిరోజుల క్రితం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ బాలుర వసతి గృహం క్యాంటీన్ చట్నీలో ఎలుక సంఘటన మరువక ముందే కూకట్పల్లి జేఎన్టీయూలో పెరుగును పిల్లి తాగుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జేఎన్టీయూలో పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు.
ఇప్పటికే కొందరు విద్యార్థులు క్యాంటీన్లలో, వసతి గృహంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత, శుభ్రత ఉండటం లేదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదని తెలిపారు. పైగా ఫిర్యాదులు, ఆందోళనలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.
ఆహార పదార్థాలపై ఉండని మూతలు : యూనివర్సిటీ క్యాంపస్‌లోని మంజీరా బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు ఆహార పదార్థాలు నాణ్యతపై ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికీ పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ఉండగా రెండు రోజుల క్రితం ఆహారపదార్ధాలపై మూతలు లేకపోవడం, బకెట్లలో ఆహార పదార్థాలను పిల్లి మూతి పెట్టి తింటున్న దృశ్యాలను విద్యార్థులు వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చట్నీలో ఎలుక పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపింది. ఆ సంఘటనతో అధికారుల్లో చలనం రాకపోవడం ఇప్పుడు మరోసారి అలాంటి సంఘటనే జరగడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కొద్ది రోజుల క్రితం చట్నీలో ఎలుక : కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూలో చట్నీ పాత్రలో ఎలుక కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక్కడి బాలుర హాస్టల్ క్యాంటీన్లో చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో గిన్నెలో ఎలుక పడింది. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా తెగ వైరల్ మారింది. చివరకు ప్రజాప్రతినిధుల వరకు చేరుకుంది. దీనిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఇప్పుడు బకెట్లో ఉన్న పెరుగును పిల్లి తాగుతున్న దృశ్యాలు విద్యార్థులు సోషల్ మీడియాలో పెట్టారు.
అల్పాహారం చట్నీలో ఎలుక - విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర - RAT IN CHUTNEY AT JNTU COLLEGE