Call Letter for Last Test of a Job to Died Young Man in Mancherial : ప్రతి వ్యక్తి జీవితంలో ఒక విషాధ గాథ దాగి ఉంటుంది. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఓ యువకుడు తీవ్రంగా కృషి చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తాను బతికి ఉన్నప్పుడు అప్లై చేసిన ఓ ఉద్యోగానికి, నాలుగేళ్ల తర్వాత చివరి పరీక్షకు హాజరుకావాలని కాల్ లెటర్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి గ్రామానికి చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్ కుమార్, అనూష, ఆదిత్య, జీవన కుమార్ సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. వారిలో ఒకరైన జీవన్ కుమార్ (24) 2014లో ఐటీఐ పూర్తి చేశారు. 2018లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా, ఆ యువకుడు అప్లై చేసుకున్నాడు. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూశాడు. అనారోగ్యంతో అక్క ఆదిత్య (2018లో), తల్లి సరోజ (జనవరి, 2019లో) మరణించారు. ఎంత ఎదురు చూసినా ఉద్యోగం రాకపోవడం, కుటుంబ సమస్యలు పెరగడంతో జీవన్ కుమార్ 2020 మార్చి 15న ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అక్క అనూష, తండ్రి మొండయ్య చనిపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు నవీన్ ఒక్కరే ఉన్నారు.
పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆన్లైన్ బెట్టింగ్ - ఉన్నదంతా పోయి చివరకు?
NPDC Exam Call Letter Died Person : ఎన్పీడీసీఎల్ సంస్థ రాత పరీక్ష మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను పిలిచింది. అనంతరం కొన్ని కారణాలతో ఆ నోటిఫికేషన్లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదు. దీంతో మిగులు పోస్టులు భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెరిట్ ప్రకారం నియామకాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆ సంస్థ మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి అభ్యర్థులను చివరి పరీక్ష అయిన స్తంభాలు ఎక్కే ఎగ్జామ్‌కు మెరిట్ జాబితా సిద్దం చేసింది. అందులో జీవన్ కుమార్ పేరు ఉంది. దీంతో చివరి పరీక్షకు రావాలని పోస్ట్ ద్వారా కాల్ లెటర్ వచ్చింది. ఆ యువకుడు చనిపోయి నాలుగు సంవత్సరాలు అయిందని తెలుసుకున్న పోస్ట్‌మ్యాన్ తిరిగి వెనక్కి పంపించాడు.