KTR On Singareni Coal Mines Auction : కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు బొగ్గు గనులు వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సాహసం చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు కలిసి హైదరాబాద్ వేదికగానే వేలంతో తెలంగాణ సంపదను దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ అన్నారని, 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. నేడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో రేవంత్‌రెడ్డి మోదీకి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. మరి సీఎం ఇప్పుడు ఎందుకు ఆయన రాజీ పడుతున్నారని ప్రశ్నించారు. దీని వెనకాల ఉన్న మతలబు ఏంటి? అని నిలదీశారు. కేసులకు భయపడుతున్నారా? అని అడిగారు. కొత్తగా కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి ఏమైనా కొత్త ప్రాజెక్టు తీసుకొస్తారని, కానీ కిషన్ రెడ్డి మాత్రం ఉన్న గనులను అమ్ముతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఎన్టీఏ అసమర్థతపై కేంద్ర విద్యా శాఖ మంత్రి వివరణ ఇవ్వాలి : కేటీఆర్
ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నెట్‌కు అప్పగించారని కేటీఆర్ తెలిపారు. అలాగే గుజరాత్‌లోనూ గనులను వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించారని వెల్లడించారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థకు బొగ్గు గనులు వేలం లేకుండా ఇచ్చారని, కానీ సింగరేణికి మాత్రం బొగ్గు గనులు కావాలంటే వేలంలో పాల్గొనాలంటున్నారని మండిపడ్డారు.
అదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిందని, నష్టాల్లోకి వెళ్లింది కాబట్టి విశాఖ ఉక్కు అమ్ముతున్నామని కేంద్రం చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకే వేలంలో పాల్గొనాలని చెబుతున్నారని, బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే, రేవంత్ రెడ్డి ఆ కత్తికి సాన పడుతున్నారన్నారని దుయ్యబట్టారు.
"బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో రేవంత్‌రెడ్డి మోదీకి లేఖ రాశారు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన రాజీ పడుతున్నారు. కొత్తగా కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి ఏమైనా కొత్త ప్రాజెక్టు తీసుకొస్తారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం ఉన్న గనులను అమ్ముతున్నారు". - కేటీఆర్, మాజీమంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి - కేటీఆర్