MLC Kavitha Bail Petition Hearing Update : దిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా 2 పిటిషన్లు కలిపి ఇవాళ దిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా, మంగళవారం రోజున ఈడీ, సీబీఐ అధికారులు తమ వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనున్నాయి.
కవిత తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఆమె అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అన్నారు. కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేదని తర్వాత కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో పేరు ప్రస్తావించారని కోర్టుకు తెలిపారు. అరెస్టు చేసిన తర్వాత బెయిల్ కోరితే ట్రయల్ కోర్టు ఇవ్వలేదని, ఆమెరి ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని వారికి పరీక్షలు ఉన్నాయని విజ్ఞప్తి చేసినా కనికరం చూపలేదని కోర్టుకు చెప్పారు.
"సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. సుప్రీంకోర్టు విచారణ చేపట్టి, దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సమన్లు ఇచ్చారు. తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వమని ఏఎస్‌జీ ఒఖ ప్రకటన చేశారు. అకస్మాత్తుగా ఒకరోజు ఇంటిలో సోదాలు నిర్వహించారు. అదేరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సాయంత్రం అరెస్టు చేశారు." - విక్రమ్ చౌదరి కవిత తరఫు న్యాయవాది
దిల్లీ మద్యం సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు - kavitha judicial Custody
'ఒక పార్టీలో ముఖ్య నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న తనపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి అరెస్టు చేశారు. ఒక మహిళగా తనకు ఉన్న హక్కుని కూడా కలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయి. మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేశామని ఆరోపించారు. వాడని మొబైల్ ఫోన్లు వేరే వారికి ఇస్తే వాళ్ళు ఫార్మాట్ చేసి వాడుకున్నారు. దానికి కూడా బాధ్యత తనపైనే మోపడం అన్యాయం. కేవలం రాజకీయ కక్ష పూరితమైన విధానంతో నమోదు చేసిన కేసులో అన్ని వివరాలు పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలి' అంటూ విక్రమ్ చౌదరి తన వాదనలు ముగించారు.
మరోవైపు ఈడీ తమ వాదనలు రేపు వినిపిస్తామని కోర్టుకు వివరించింది. ఇవాళే వాదనలు వినిపించాలని న్యాయమూర్తి పేర్కొనగా, రేపు తగిన డాక్యుమెంట్లతో కోర్టుకు భౌతికంగా హాజరై వాదనలు వినిపిస్తామని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దర్యాప్తు సంస్థల వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తానని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వెల్లడించారు. మరోవైపు దర్యాప్తు సంస్థల వాదనల తర్వాత రిజాయిండర్ వాదనలకు అవకాశం ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా కోర్టు అంగీకరించింది.
కాగా ఇదే కేసులో సుప్రీంకోర్టును అరుణ్ రామచంద్ర పిళ్లై ఆశ్రయించారు. దిల్లీ హైకోర్టు ఇచ్చిన తుది ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. దీంతో నిందితుడు చెప్పాలనుకున్నవి హైకోర్టు ముందే చెప్పాలని, బెయిల్ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని పిళ్లైని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.