BRS and BJP clash Govt Giving Bonus to Small Grains : సన్న రకాలు పండించే రైతులకు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతులను నిలువునా ముంచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబరు 9న రుణమాఫీ అని చెప్పి ఆగస్టు 15కు, వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటూ మాట మార్చారని విమర్శించారు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ సర్కార్‌కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని ఆగమాగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దొడ్డు బియ్యం కొనడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు వచ్చిన నష్టమేంటి? రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి. కానీ కేంద్రం కొంటామని చెబుతున్న దొడ్డు రకం వరిని బోనస్ ఇచ్చి కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈరోజు హామీలు ఇచ్చి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు." - కిషన్ రెడ్డి , కేంద్ర మంత్రి
మరోవైపు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దొడ్డు రకం వడ్లను పండించే సాగుదారులను సైతం సర్కార్ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొడ్డు వడ్ల రకాలు పండించే రైతులకు బోనస్ ఇచ్చేంతవరకు అన్నదాతలకు అండగా ఉండి పోరాడతామని ప్రతిపక్ష నాయకులు తేల్చి చెబుతున్నారు.
"రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లనే ఉంటాయి. దొడ్లు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి. ఈ విషయాన్నే రైతులు నేడు ముక్త కంఠంతో కోరుతున్నారు. డబ్బాలో ఓట్లు పడిన తర్వాత మాట మార్చి రైతులను అన్యాయం చేశారు. మేము సన్న రకాలకే బోనస్ ఇస్తాం. దొడ్డు రకాలకు ఇవ్వమని చెప్పారు. రైతును పూర్తిగా మోసం చేశారు." - హరీశ్‌రావు, మాజీ మంత్రి
బీఆర్ఎస్, బీజేపీలు రైతులను రెచ్చగొడుతున్నాయి : రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు విపక్ష నాయకులు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దొడ్డు రకాలు పండించే కర్షకులను సైతం కాంగ్రెస్ సర్కార్ ఆదుకుంటుందని అన్వేశ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని తరుగులేకుండా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.
దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనటం దారుణం: హరీశ్‌రావు - Harish Rao on Paddy Bonus Issue