Boy Dies in Road Accident at Rajampet : ఆసుపత్రి బెడ్‌పై కుమారుడి పక్కన పడుకుని బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొడుతోంది. కాసేపట్లో అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోతామని చెబుతోంది. అన్నకు చూపించాము, ఇక ఇంటికి వెళ్లిపోవచ్చు అని చిన్న కుమారుడితో చెబుతోంది. కానీ ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించిందని, ఇక మళ్లీ తనను అమ్మా అని పిలవలేడని ఎవరు చెప్పినా ఆ తల్లి మనసుకు తీసుకోవడం లేదు. ఓవైపు ఏడుస్తూనే మరోవైపు భ్రమతో కుమారుడి మృతదేహాన్ని పైన కూర్చోబెట్టుకుని అతనితో మాట్లాడింది. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
బైక్ అదుపు తప్పి : బాధితుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన బాబూరామ్, శిరీష దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు కాగా, చిన్న కుమారుడికి (3) ఇటీవల ఆరోగ్యం బాలేకపోతే పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరికి ఇంటికి వెళ్తుండగా, బైక్ అదుపు తప్పి అంతా కిందపడిపోయారు. ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్(5) ఎగిరి రోడ్డు మీద పడటంతో అతని తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కన్నయ్యా నిద్ర లే అంటూ : సిబ్బంది బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్‌పై ఉంచగా తల్లి శిరీష తన పక్కనే పడుకుని 'కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే' అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయారు. ఎవరు దగ్గరకు వెళ్లినా రానివ్వకుండా 'నా కుమారుడిని ముట్టుకోనివ్వను, వాడు చాలా అందంగా ఉంటాడు' అని చెప్తుంది. బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా, తనకు ఏమీ కాలేదని, పిల్లాడు పడుకున్నాడని, నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో ఆయనా కన్నీరూ పెట్టుకుంటూ ఉండిపోయారు.
ఎదురెదురుగా ఢీకొన్న 2 బైకులు - ముగ్గురి మృతి, మరొకరికి గాయాలు