Bomb Threats To Raj Park Hotel in Tirupati : తెలుగు రాష్ట్రాల్లో వరుస బాంబు బెదిరింపులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజులుగా వస్తున్న బాంబు బెదిరింపులు అందరినీ కలవరపెడుతున్నాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం పలు విమానాలకు బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు తిరుపతిలోని పలు హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.
తిరుపతిలోని రాజ్‌పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు : ఇవి మరవక ముందే తాజాగా తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై హోటల్లో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడి డీఎస్పీ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేశారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు ఈ బాంబు బెదిరింపుపై దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని విమానాలకు బాంబు బెదిరింపులు : శుక్రవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులను కిందకు దింపేసి తనిఖీలు చేపట్టారు.
దేశంలో విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బాంబు బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈవారం రోజుల్లో దాదాపు 100కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలపై ఇప్పటికే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆటకట్టించేందుకు కఠినచర్యలు తీసుకొనే దిశగా పౌర విమానయానశాఖ కూడా సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితిపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ఇలాంటి బాంబు బెదిరింపులు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీటిపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. ఇవి బూటకపు బెదిరింపులు అయినప్పటికీ పోలీసులు విస్తృత తనిఖీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.