Ashwaraopet SI Sriramulu Srinu Died : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సీఐ జితేందర్ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుల్స్ పనిలో సహకరించకపోవడమే కాకుండా కులం పేరుతో వేధించారని ఆత్మహత్యాయత్నం అనంతరం ఎస్సై శ్రీను ఓ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల 30న స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లిన ఎస్సై శ్రీను ఎంతకు తిరిగి రాకపోయే సరికి అశ్వారావుపేట పోలీసులు గాలింపు చేపట్టారు. ఈలోగా ఆయనే 108కు ఫోన్ చేసి తాను మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆయన చెప్పారు. ఆ ప్రాంతానికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఆయనను హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఎస్సై శ్రీను చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వరావుపేట సీఐ జితేందర్ రెడ్డిని వరంగల్ ఐజీకి, నలుగురు కానిస్టేబుల్స్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తన భర్త ఆత్మహత్యకు సీఐ జితేందర్, నలుగురు కానిస్టేబుల్స్ కారణమని ఎస్సై శ్రీరముల శ్రీను భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
"నలుగురు కానిస్టేబుల్స్ నా మాట వినడం లేదని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీఐ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాను. అయినా దానిపై యాక్షన్ తీసుకోలేదు. అసలు పట్టించుకోలేదు. ప్రతి చిన్న విషయానికి నాకు సీఐ మెమో ఇచ్చారు. అప్పుడు నాకు అర్థం అయింది వీళ్లు కావాలనే హింసిస్తున్నారని. బదిలీ పెట్టుకున్నా అది ఆలస్యం అయింది." - శ్రీను, అశ్వారావుపేట ఎస్సై
అసలేం జరిగింది : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత జూన్ 30న మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మణుగూరు పోలీస్ స్టేషన్ నుంచి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు ఎస్సై శ్రీను బదిలీపై వెళ్లారు. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట. 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు.
అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ శేఖర్, శివ నాగరాజు, సన్యాసినాయుడు, సుభాని పనిలో ఆయన సహకరించలేదని ఎస్సై శ్రీను ఓ వీడియోలో తెలిపారు. అలాగే తనను తీవ్రంగా వేధించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. కులం పేరుతో కించపరిచేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. మరోవైపు సీఐ జితేందర్ రెడ్డి నాలుగు నెలల్లోనే నాలుగు మెమోలు ఇచ్చారని గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బదిలీ కోసం చేసిన ప్రయత్నాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. అనంతరం ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం - పలువురి పోలీసులపై కేసు నమోదు
సీఐ కార్యాలయం ఎదుట మహిళ బైఠాయింపు - ఎస్సై డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ