Ashtadasha Shakti Peethas in Mancherial : దేశంలోని శక్తి పీఠాలన్నింటిని ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. కొందరు తమకు జాబ్, పెళ్లి ఇలా వారు కోరుకున్నవి అయ్యాక దర్శనానికి వెళ్తే, కొందరు తమ రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తుంటారు. అలా వారు దేశంలో ఉన్న 18 శక్తి పీఠాలను దర్శించుకోవాలి అంటే పట్టే సమయం, ఖర్చు అంతా ఇంతా కాదు. దానికి ఓపిక కూడా అంతే కావాలి. దేశం మొత్తం తిరిగి అన్ని గుళ్లను దర్శించుకోవాలి. కానీ అవి చూడటం అందరికీ సాధ్యపడదు. ఆర్థిక సమస్యలు, సమయం ఇలా ఎన్నో కారణాలు. వాటన్నింటిని చూసే అవకాశం వస్తే ఎవరైనా టక్కన తలూపేస్తారు. అలాంటి సువర్ణవకాశం కల్పిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు.
అమ్మవార్ల రూపాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్యర్యంలో దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భారీ సెట్ వేశారు. భక్తులకు కనువిందు కలిగేందుకు మంచి ప్లాన్ వేశారు. దేశంలోని అన్ని శక్తి పీఠాల అమ్మవార్ల రూపాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి భక్తులకు వాటి దర్శనం కల్పిస్తున్నారు.
భారీగా వస్తున్న భక్తులు : ఇలా దేవలందరూ ఒకే చోట దర్శనం ఇవ్వడంతో భక్తులు సంతోశం వ్యక్తం చేస్తున్నారు. భక్తిశ్రద్ధలతో శక్తి పీఠాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నారు. నవరాత్రుల పూజలు పూర్తయ్యే వరకు శక్తి పీఠాల దర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
"బెల్లంపల్లి వాసవి పరమేశ్వర ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా అష్టాదశ శక్తి పీఠాలను ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతి అయిన సమయంలో అమ్మవారి 18 శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. అలాంటి అష్టాదశ శక్తి పీఠాలను దుర్గా నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది." - రేణికుంట్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు
వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు - SHARANNAVARATRI AT BHADRAKALI