Golconda Bonalu Celebrations 2024 : ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు, కుంకుమలు అద్దుకుంటుంది. వేప వాసనలతో ఊరువాడ డప్పు చప్పుళ్లతో మురిసిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు ఆదివారం గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కోటపై స్వయంభుగా వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మకు భక్తులు వైభవంగా బోనాలను సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢమాసంలో జరిగే బోనాలలో గోల్కొండ కోటది అత్యంత ప్రముఖపాత్ర. ఏటా తొలిబోనం భక్తులు జగదాంబిక అమ్మకు అర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారిసైతం డిల్ల మోతలు బళ్లెం చప్పుళ్లు డప్పుదరువుల మధ్య అమ్మకు తొలిబోనం అందిచారు.
ఉదయం కోటపై వేలిసిన అమ్మకు ప్రత్యేక పూజల అనంతరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలను సమర్పించారు. ఈసారి కుమ్మర్ల బోనం పేరుతో భారీగా మహిళలతో బోనాలను అమ్మకు అర్పించారు. ఇక గోల్కొండ కోటకు వచ్చే భక్తుల కోసం సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది మంచి నీటి అందించటంతోపాటు హెల్త్ క్యాంపులను సైతం నిర్వహించింది.
గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మ బోనాల జాతర నిర్విరామంగా దశాబ్దాలుగా సాగుతోంది. ఆలయ పూజారి ఇంట్లో ఉండే అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మరింత శోభాయమానంగా సాగింది. తొలుత లంగర్‌హౌజ్‌కి చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ , మేయర్ గద్వాల విజయ లక్ష్మి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అక్కడి నుంచి పూజారి ఇంటికి వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు.
అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, నజర్ బోనంతో కూడిన తొట్టెల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. వివిధ రూపాల్లో అలంకరణ చేసుకున్న కళాకారులతో ఊరేగింపు ఆధ్యంతం భక్తులను కనువిందు చేసింది. లంగర్ హౌజ్‌లో ప్రారంభమై శోభాయమానంగా సాగిన ఊరేగింపు గోల్కొండ కోటకు చేరిన తర్వాత అమ్మవారి విగ్రహాలను ఆలయంలో ఉంచి ఊజలను నిర్వహించారు. జులై 7నుంచి తొమ్మిది వారాలపాటు అంటే ప్రతి గురు, ఆదివారాల్లో అమ్మవార్లకు వివిధ అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఆగస్టు 4వరకు ఆషాఢ మాసం బోనాలు : కాగా హైదబాద్‌లో ఆషాఢం బోనాల జాతర ఆగస్టు 4వ తేదీ వరకు సాగనుంది. ఈ నెల 21,22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 21 బోనాలు ఉండగా 22న అమ్మవారి రంగ ప్రవేశం ఉంటుంది. 28,29 తేదీల్లో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు జరుగనున్నాయి. 28న బోనాలు, 29న రంగప్రవేశం ఉంటుంది. గోల్కొండ కోటలో వైభవంగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. భక్తులు తెచ్చిన బోనాలతో గోల్కొండ కోట పసుపు కుంకుమలు అద్దుకుంది. డప్పు చప్పుళ్లతో గోల్కొండ పరిసరాలు మారుమోగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢమాసం మొత్తం బోనాల జాతరలు అత్యంత వైభవంగా సాగనున్నాయి.
బోనమెత్తనున్న భాగ్యనగరం, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు - విశేషాలివే! - Bonalu festival 2024
ఆదివారం నుంచే బోనాల సందడి- ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? - Bonalu 2024