AP High Court Unhappy on Govt About Helmet Issue : ఏపీలో హెల్మెట్ ధరించని వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 99 శాతం మంది హెల్మెట్ ధరించకుండా బైక్‌లను నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని పేర్కొంది. విజయవాడలో హెల్మెట్ ధరించిన వారు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
పూర్తి వివరాలు సమర్పించాలి : హెల్మెట్ ధారణ తప్పనిసరని తాము ఉత్తర్వులిచ్చాక ఎంత మంది ప్రమాదాల్లో మరణించారు. ఇప్పటి వరకు ఎన్ని చలానాలు విధించారు. ఎన్ని లైసెన్సులు రద్దు చేశారన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
విస్తృత ప్రచారం : ఈ కేసు విషయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ 2023 ఆగస్టు నాటికి 69,161 చలానాలు విధించామని పేర్కొన్నారు. చలానాలు చెల్లించకుంటే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తున్నామని తెలిపారు. సీసీ టీవీల ఏర్పాటుతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
చట్ట నిబంధనల అమలులో అలసత్వం : కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 2022లో ద్వి చక్ర వాహనాల ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో 3,703 మంది మృతి చెందరని తెలియజేశారు. హెల్మెట్ ధరించని కారణంగా అందులో 3,042 మంది చనిపోయారని ఈ సందర్భంలో వెల్లడించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, హెల్మెట్ ధారణ నిబంధనను తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మీ బైక్‌పై నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదా..! అయితే కోర్ట్ మెట్లు ఎక్కాల్సిందే