AP CM Chandrababu On Party Workers : తెలంగాణలో పార్టీ బలోపేతంపై కార్యకర్తలు తనను అడిగారని, అందుకు తగిన ప్రణాళికా రచన చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే, తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని తెలిపారు. విజన్ 20-20 అన్నప్పుడు తనను అందరూ హేళన చేశారని, ఈసారి విజన్ - 2047తో పని చేసి తెలుగు రాష్ట్రాలను ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాం : తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడేందుకు నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయలేదని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తెలుగుదేశం బలమైన పార్టీ అన్న ఆయన, కొన్ని కారణాల వల్ల రాష్ట్రంలో పార్టీ బలహీన పడిందన్నారు. మంచి వాతావరణంలో రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రపంచంలో నెం.1గా ఉండాలి : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో తెలుగుదేశం ఉంటుందా? లేదా ప్రత్యేకంగా ఉంటుందా? అనే అంశాన్ని ఇప్పుడే మాట్లాడలేనని, త్వరలో వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసం జరిగిందని, దాన్ని పునర్నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ముందుకెళ్తామని తెలిపారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు నంబర్ 1గా ఉండాలనేదే తన లక్ష్యమన్నారు. టీడీపీ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ అని వివరించారు. ఇరు రాష్ట్రాల సమస్యల్ని సహృద్భావ వాతావరణంలో చర్చించుకుని, పరిష్కరించుకుంటామని పునరుద్ఘాటించారు.
ప్రతి నెలా సమావేశం : శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు రద్దు అవుతాయని తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కమిటీలు రద్దు అవుతాయన్నారు. కాగా ప్రతి నెలా రెండో శనివారం రోజున చంద్రబాబు నాయుడు తెలంగాణ నాయకులతో సమావేశమై, ఇక్కడి పరిస్థితులను ఆరా తీసే అవకాశం ఉంది.