ఆసక్తికరంగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు- సభ ముందుకు కీలక బిల్లులు - AP ASSEMBLY BUDGET SESSIONS 2024
ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ, శాసన మండలి - 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2024, 7:42 PM IST
|Updated : Nov 10, 2024, 9:11 PM IST
AP Assembly Budget Sessions 2024: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీలో ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావులు కేశవ్ 2024 - 25 ఏడాదికి ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందుగా ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది 2024-25 ఆర్థిక బడ్జెట్ కు మంత్రి వర్గం ఆమోదం తెలియ జేయనుంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ యాక్టు సహా కొన్ని కీలకమైన బిల్లులకు శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నాలుగు నెలలకు గాను ఓటాన్ ఏకౌంట్ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తరువాత మరో నాలుగు నెలలకు గాను ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌కు అమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో వచ్చే నాలుగు నెలలకు గాను పూర్తి స్థాయిలో 2024- 25 ఏడాదికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
ఆయనగారు అసెంబ్లీకి రారంట - ఇంట్లో కూర్చుని రికార్డు వీడియోలు వదులుతాడంట
సంక్షేమ పథకాలకు బడ్జెట్లో పెద్ద పీట: ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ని మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఉదయం 9 గం.కు బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ వాయిదా తర్వాత సభాపతి అధ్యక్షతన బీఎసీ సమావేశం జరగనుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదేళ్లకు గాను ప్రవేశ పెట్టిన ఆర్ధిక బడ్జెట్లలో ఏక్కడా తాము చేసిన అప్పులు చూపించలేదు. ఇదే సమయంలో అభివృద్ది కార్యక్రమాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ది - సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరి కొన్ని సంక్షేమ పధకాలకు బడ్జెట్లో పెద్ద పీట వేయనున్నారు.
ప్రాధాన్య రంగాలైన వ్యవసాయం, సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇతర కీలక శాఖలకు కూడా భారీగానే నిధులు కేటాయింపులు జరగనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయం పెంపు మార్గాలపై కూడా బడ్జెట్లో ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లకు కేంద్ర బడ్జెట్లోనే భారీగా నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రతిపాదనలు కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రతిఫలించేలా రూపకల్పన చేశారు. బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధ్యాన్యతా అంశాలకే అధిక నిధులు కేటాయింపులు జరిపే అవకాశం ఉంది.
'జగన్ అయినా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే'
కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం: అసెంబ్లీ సమావేశాలు సుమారు పది రోజులు పాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ అమోదంతో పాటు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో లక్షల ఎకరాల్లోని భూములు అన్యాక్రాంత అయ్యాయి. భూముల ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982 ఇబ్బందిగా ఉందని దానిని రద్దు చేసి కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024 ను ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు దేవాలయాల్లోని పాలక మండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యులు నియామకంపై బిల్లును ప్రవేశపెట్టనుంది.
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ కమీషన్ రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. అలాగే జ్యూడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 61 ఏళ్ల కు పెంచుతూ చట్ట సవరణ చేయనున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం ఆర్ఢినెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రైవేటుకు మద్యం దుకాణాలు నిర్వహించేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వ హయంలో మద్యం ధరలను దారుణంగా పెంచారు. వాటి స్థానంలో మద్యం ధరలు తగ్గించే అంశంపై బిల్లు ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు మరి కొన్నికీలక బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సమావేశాలకు దూరంగా వైఎస్సార్సీపీ: శాసన సభ సమావేశాలకు దూరంగా ఉంటామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన అంశాలపై బయట మీడియాతో తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని జగన్ ప్రకటించారు. అయితే శాసన మండలి సభ్యులు మండలి సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
'జగన్ అసెంబ్లీకి వెళ్లాలి - అధికార పక్షం నిర్ణయాలను ప్రశ్నించాలి'