Telangana Congress Joinings 2024 : రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టి ఊపు మీదున్న హస్తం పార్టీ, ఓవైపు ఎన్నికల ప్రచారాలను హోరెత్తిస్తూనే మరోవైపు చేరికల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇతర పార్టీ అభ్యర్థుల రాకను ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించటంతో పలు పార్టీల నేతలు ఒక్కొక్కరుగా గాంధీభవన్ బాట పడుతున్నారు. ఆ దిశగానే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్, పీఏసీఎస్ స్టేట్ ఫోరం ఛైర్మన్ అయిన ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీ 12 సీట్లకు పైగా సాధించడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడిన వారికి ఎల్లప్పుడు ప్రాధాన్యం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారని, ఆయన ఆదేశాలను తప్పకుండా పాటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని దయాకర్ రెడ్డి తెలిపారు.