Adilabad Young Doctor Arun Kumar Sucess Story : దేశవ్యాప్తంగా ఏటా జూలై ఒకటో తేదీన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం జరుగుతుంది. వైద్యసేవల్లో విశేష కృషి చేసేవారిని అవార్డులు ప్రధాన చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది హైహెడ్జ్ మీడియా, ఐకెన్ ఫౌండేషన్, ఏషియన్ ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ సంస్థల సంయుక్తంగా చేపట్టిన 2023-24అవార్డుల ప్రధానోత్సవం జూలై ఒకటోతేదీన జైపూర్ కేంద్రంగా జరిగింది. వైద్యరంగంలో 120 విభాగాలుంటే వైద్యుల కేటగిరీ కింద ఎక్స్‌లెన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అవార్డు ఈ యువవైద్యుడిని వరించింది.
ఈ యువ వైద్యుడి పేరు ఓరుగంటి అరుణ్‌కుమార్. స్వస్థలం సూర్యాపేట జిల్లా. ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో పాథాలాజీ పీజీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అందరిలా ఏదో ఎంబీబీఎస్ పూర్తి చేశాం. పీజీ సీటు సాధించామా.? చదివామా.? అని కాకుండా ఈ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించాలనే తపనతో కెరియర్‌లో ముందుకు వెళ్తున్నాడు ఈ యువకుడు.
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటి నుంచే క్విజ్‌లు, సెమినార్లలో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నాడు అరుణ్. 2017 చైనాలోని షాంఘై వేదికగా జరిగిన సెమినార్‌లో ఉత్తమ వైద్య విద్యార్థి విభాగంలో బహుమతి సాధించాడు. 2022 హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. 2023 మంగళూరు ఫాదర్ ముల్లర్ మెడికల్ కళాశాలలో క్విజ్ పోటీల్లో సత్తాచాటాడు. ఇలా వైద్యరంగానికి సంబంధించిన పోటీలు ఎక్కడ జరిగిన పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చూపించాడు ఈ యువ వైద్యుడు.
డాక్టర్లతో కలిసి పలు పరిశోధనల్లోనలు : విద్యార్థి దశ నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయి క్విజ్‌లు, సెమినార్‌లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకుని రికార్డులు సాధించాడు అరుణ్. డాక్టర్లతో కలిసి పలు పరిశోధనల్లోనూ భాగమయ్యాడు. వీటినే ప్రామాణికంగా తీసుకొని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ బృందం అతడిని ఉత్తమ వైద్యుడిగా ప్రకటించింది. దాంతో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల నుంచి జాతీయస్థాయి అవార్డు పొందిన తొలి వైద్యుడిగా రికార్డు సృష్టించాడు అరుణ్.
విద్యలో ప్రతిభ, వృత్తిలో విశేష సేవలు, పరిశోధనలు చేసిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేస్తారు. అయితే వ్యక్తిగత దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా 126 మంది వైద్యులు పోటీ పడ్డారు. కానీ వచ్చిన నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన నిర్వహకుల బృందం 2023-24 సంవత్సరానికి జాతీయ ఉత్తమ వైద్యుడిగా అరుణ్‌కుమార్‌ని ప్రకటించింది.
జాతీయ ఉత్తమ వైద్యుడి అవార్డు : జాతీయ ఉత్తమ వైద్యుడి అవార్డు రావటమంటే వైద్య రంగంలో అరుదైన గుర్తింపు. అలాంటి అవార్డుకు తాను ఎంపిక కావటం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు అరుణ్. అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రముఖుల నుంచి అవార్డు అందుకోవటం జీవితంలో మరిచిపోలేని రోజు అని చెబుతున్నాడు. అరుణ్‌కుమార్‌ది కష్టపడే మనస్తత్వం. కళాశాలలో నిరంతరం సాధన చేశాడు. ఆ పట్టుదల, సాధనల ఫలితమే ఈ అవార్డులు, రికార్డు అంటున్నాడు.
విద్యార్థిగా నేర్చుకుంటూనే గూగుల్ మీటప్స్ ద్వారా వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు అరుణ్. 20 దేశాల్లోని దాదాపు 1,500 మంది విద్యార్థుల సందేహాలని ఉచితంగా తీర్చుతున్నాడు. దీనికోసం వారంలో ఒకటి, రెండు రోజులు కేటాయిస్తున్నాడు. జీవితంలో జరిగిన సంఘటన డాక్టరు కావాలనే లక్ష్యానికి ప్రేరణగా నిలిస్తే ఈ అవార్డు ద్వారా మంచి వైద్యుడిగా, పరిశోధకుడిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నాడు.
YUVA : సంకల్పం ముందు - వైకల్యం ఓడింది - ఈయన ఓ తరానికి ఇన్స్పిరేషన్ - Disabled Man Inspiring Story